అమరావతి : ఏపీలోని పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ( Pinnelli Ramakrishna Reddy ), ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి ( Pinnelli Venkata Rami Reddy ) లకు సుప్రీం కోర్టు ( Supreme Court ) లో చుక్కెదురయ్యింది . వారిద్దరికి హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్‌ను కొట్టివేసింది.
కేసు వివరాలు.. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం బోదలవీడు వద్ద టీడీపీ కార్యకర్తలైన గుండ్లపాడుకు చెందిన కోటేశ్వరరావు, వెంకటేశ్వర్లును ప్రత్యర్థులు దారుణంగా హత్యచేశారు. తెలంగాణలోని హుజూర్ నగర్లో ఓ వివాహ వేడుకకు హాజరైన వీరిద్దరూ బైకు మీద వెళ్తుండగా కొందరు స్కార్పియో వాహనంతో ఢీకొట్టారు. అనంతరం ఊపిరితో ఉన్నట్లు గమనించి రాళ్లతో మోది హత్యచేశారు. అనంతరం వాహనాన్ని అక్కడే వదిలేసి నిందితులు పరారయ్యారని తెలిసిందే. ఈ ఘటనలో 30 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ కేసులో ఏ6గా మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఏ7గా ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి పేర్లను చేర్చారు. ఈ కేసులో ఏ1 గా జవిశెట్టి శ్రీను, ఏ2గా తోట వెంకటరావు, ఏ3 గా తోట గురువయ్య, ఏ4 గా నాగరాజు, ఏ5గా తోట వెంకటేశ్వర్లు ఉన్నారు. ఈ కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేయగా హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందారు.
బెయిల్‌పై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లగా శుక్రవారం ఈ మేరకు పిన్నెల్లి సోదరులు దాఖలు చేసిన రెండు పిటిషన్లను కొట్టివేసింది. ఇద్దరిని వెంటనే అరెస్టు చేసేందుకు ఎలాంటి అనుమతులు అవసరం లేదని వెల్లడించింది అయింతే పిన్నెల్లి సోదరులు లొంగిపోవడానికి రెండు వారాలు సమయమివ్వాలని పిన్నెల్లి తరఫు న్యాయవాదులు చేసిన విజ్ఞప్తికి కోర్టు అనుమతిచ్చింది.