అమరావతి : ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా సీకే పల్లిలో విద్యార్థిని ( Student) ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నానికి ( Suicide attempt ) పాల్పడింది. దీంతో ఆమె పరిస్థితి విషమంగా మారింది. గత కొన్ని రోజులుగా యువకుడు వేధిస్తున్నాడని విద్యార్థిని ధర్మవరం పోలీసులను ఆశ్రయించింది. ఈ కేసు తమ పరిధిలోకి రాదని సీకే పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయాలని అక్కడి పోలీసులు ఆమెకు సూచించారు.
పైగా కేసు నమోదు చేయకుండా సీకేపల్లి పోలీసులు తమ పట్ల దుర్భాషలాడారన్న మనస్తాపంతో విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన తండ్రి ఆమెను కిందకు దించి అనంతపురం ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె పరిస్థితి విషమం మారింది. బెంగళూరులో వైద్యం చేయించాలని అనంతపురం వైద్యులు సూచించగా ఆర్థిక స్థోమత లేదని యువతి తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఆమెకు అనంతపురంలోనే చికిత్స అందిస్తున్నారు.