అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. రామగిరి డిప్యూటీ తహసీల్దార్ కుమారుడు, భార్య అనుమానాస్పదంగా మరణించారు. కుటుంబ కలహాల కారణంగా కుమారుడిని చంపి ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటుందని అనుమానిస్తున్నారు.
కర్నూలు జిల్లా తాడిమర్రికి చెందిన రవి అనంతపురం జిల్లా రామగిరి డిప్యూటీ తహశీల్దార్గా పనిచేస్తున్నాడు. అతనికి ఐదేళ్ల క్రితం అమూల్య అనే మహిళతో వివాహమైంది. వీరికి మూడున్నర ఏళ్ల కుమారుడు సహర్ష ఉన్నాడు. అనంతపురంలోని శారదా నగర్లో కుటుంబంతో రవి ఉంటున్నాడు. అయితే గురువారం ఉదయం రవి డ్యూటీకి వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగొచ్చి తలుపు కొట్టగా.. ఎంతకీ తలుపు తీయలేదు. దీంతో కిటికీలో నుంచి చూడగా ఉరేసుకుని అమూల్య కనిపించింది. మంచంపై రక్తపు మడుగులో కుమారుడి మృతదేహం ఉంది.
కాగా, కుటుంబ కలహాల కారణంగానే అమూల్య ఆత్మహత్య చేసుకుని ఉంటుందని అనుమానిస్తున్నారు. ఈ విషయం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. మృతురాలు అమూల్య తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. అమూల్య నిజంగానే ఆత్మహత్య చేసుకుందా? లేదా హత్య చేశారా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.