లాయర్ కావాలనుకొని నటిగా మారానని, తెలుగు సినిమాలకే తన తొలి ప్రాధాన్యం అని చెప్పింది కథానాయిక నయన్ సారిక. గం గం గణేశా, ఆయ్, క వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైందీ మరాఠీ భామ. ఆమె శ్రీవిష్ణు సరసన నటించిన తాజా చిత్రం ‘విష్ణు విన్యాసం’. యదునాథ్ మారుతీ రావు దర్శకత్వంలో సుమంత్ నాయుడు జి నిర్మించిన ఈ సినిమా.. ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా మంగళవారం నయన్ సారిక విలేకరులతో సినిమా విశేషాల్ని పంచుకుంది. ఈ సినిమాలో తన పాత్రపేరు మనీషా అని, కాలేజీ లెక్చరర్‌గా కనిపిస్తానని చెప్పింది.
ఇద్దరు లెక్చరర్స్ నడుమ ప్రేమకథగా, వినోదంతో పాటు భావోద్వేగాలతో ఆకట్టుకునే కథాంశమిదని ఆమె తెలిపింది. ‘మనీషా పాత్ర భిన్న పార్శాల్లో సాగుతుంది. ఓరకంగా హీరోపై డామినేటింగ్‌గా అనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో నా క్యారెక్టర్ అబ్బాయిలకు కాస్త చిరాకుగా అనిపిస్తుంది. అందుక్కారణం ఏమిటో ద్వితీయార్ధంలో తెలుస్తుంది. అప్పటి నుంచి మనీషాను అందరూ ఇష్టపడతారు’ అని నయన్ సారిక చెప్పింది. ప్రేక్షకుల్ని నవ్వించడం చాలా కష్టమని, ఈ విషయంలో శ్రీవిష్ణు చాలా టాలెంటెడ్ అని, ఆయన కామెడీ టైమింగ్ నేచురల్‌గా ఉంటుందని ప్రశంసించింది. ఇటీవల ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకోవడంతో తన కల నెరవేరిన అనుభూతి కలిగిందని, రాజమౌళి దర్శకత్వంలో పని చేయాలన్నది తన డ్రీం అని నయన్ సారిక తెలిపింది.