కరీంనగర్ తెలంగాణచౌక్, ఫిబ్రవరి 24: అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆర్టీసీ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. కార్మికులను మోసం చేస్తే ఊరుకునేది లేదని, తమ డిమాండ్లు నెరవేర్చే వరకూ ప్రభుత్వంపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్లోని ఇందిరా పార్కు వద్ద మంగళవారం తలపెట్టిన ‘చలో సెక్రటేరియట్’కు జేఏసీ రీజియన్ చైర్మన్ ఎంపీరెడ్డి, సీనియర్ నాయకుడు మనోహర్ నేతృత్వంలో కరీంనగర్ రీజియన్ నుంచి పెద్ద సంఖ్యలో డ్రైవర్లు, కండక్టర్లు తరలివెళ్లారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి కాంగ్రెస్ మాటతప్పిందని మండిపడ్డారు. రెండేళ్లు దాటినా ఎలాంటి ప్రక్రియ చేపట్టకపోవడం సరికాదని హితవు పలికారు.
మహాలక్ష్మి పథకంతో డ్రైవర్లు, కండక్టర్లతోపాటు సిబ్బందికి పని భారం పెరిగిందని, రోజుకు 16గంటలు పనిచేయడం వల్ల విశ్రాంతిలేక అనారోగ్యాల పాలవుతున్నామని వాపోయారు. అన్ని విభాగాల్లో ఖాళీను భర్తీ చేయాలని, ఎనిమిది గంటల డ్యూటీలు కేటాయించాలని డిమాండ్ చేశారు. బడ్జెట్లో ఆర్టీసీకి అధిక నిధులు కేటాయించాలని, మహాలక్ష్మి బకాయిలు చెల్లించాలన్నారు. ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ యాజమాన్యమే నడిపించాలన్నారు. డిపో-2లను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకుంటే ఆర్టీసీ జేఏసీ తీసుకునే నిర్ణయం మేరకు ఆందోళనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.