ముంబై: షూటింగ్‌కు వెళ్లేందుకు ఒక మోడల్ రైలులో ప్రయాణించింది. స్లీపర్ కోచ్ టికెట్ ఉన్న ఆమె ఏసీ కోచ్‌లోకి ఎక్కి ఒక సీటులో కూర్చొంది. ఆ సీటు రిజర్వ్ చేసుకున్న వ్యక్తి ఫిర్యాదుతో టీసీ, రైల్వే పోలీసులు అక్కడకు రాగా ఆమె హంగామా చేసింది. ఘర్షణలో తన డ్రెస్ విప్పుకోవడంతో పాటు బ్లేడ్‌తో వారిపై దాడి చేసింది. (Model strips, attacks RPF cops) చివరకు రైల్వే పోలీసులు ఆ మోడల్‌ను అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలో ఈ సంఘటన జరిగింది. థానేకు చెందిన 31 ఏళ్ల మోడల్ అంతర బెనర్జీ ఒక వెబ్ సిరీస్ షూటింగ్ కోసం ఆగస్ట్ 12న రాత్రి వేళ బాంద్రా-గంగానగర్ ఆరావళి ఎక్స్‌ప్రెస్‌లో సూరత్‌కు ప్రయాణమైంది. అయితే ఏసీ క్లాస్ టికెట్ లభించకపోవడంతో స్లీపర్ క్లాస్ టికెట్ ఉన్న ఆమె ఏసీ కోచ్‌లోకి ఎక్కింది. ఒక సీటులో కూర్చొంది.
కాగా, రిజర్వ్ చేసుకున్న వ్యక్తి ఆ సీటు ఖాళీ చేయాలని మోడల్ అంతరాను కోరగా ఆమె నిరాకరించింది. దీంతో ఆ ప్రయాణికుడు టీసీని పిలువగా ఆమె మొండిగా వాదించింది. ఈ నేపథ్యంలో ఆర్పీఎఫ్ అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్ యామిని కాంత్ మిశ్రా, కానిస్టేబుల్ రాజేష్ కుమార్‌లను టీసీ పిలిపించారు. అయితే మోడల్ అంతర వారితో మరింత దూకుడుగా ప్రవర్తించింది. ఘర్షణ నేపథ్యంలో తన బట్టలు విప్పేసింది. ఆర్పీఎఫ్ సిబ్బంది, టీసీపై బ్లేడుతో దాడి చేయడంతో పాటు తనను తాను గాయపర్చుకున్నది.
ఆ తర్వాత ట్రైన్ విండో బ్రేక్ చేసి తప్పించుకునేందుకు ఆ మోడల్ ప్రయత్నించినట్లు ఆర్పీఎఫ్ ఏఎస్ఐ యామిని కాంత్ మిశ్రా ఆరోపించారు. ఈ ఘర్షణలో తన యూనిఫాం, మొబైల్ ఫోన్ దెబ్బతిన్నాయని, తన కళ్లద్దాలు పగిలినట్లు ఆర్పీఎఫ్ అధికారిణి ఫిర్యాదు చేశారు. దహాను స్టేషన్లో ప్రభుత్వ రైల్వే పోలీసులకు ఆ మోడల్‌ను అప్పగించగా బెయిల్‌పై ఆమె విడుదలైనట్లు వివరించారు. మోడల్ అంతరాపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు వెల్లడించారు.