మంచిర్యాల, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో ఇటీవల మంత్రి వివేక్ కాన్వాయ్‌పై దాడి చేసినట్టు నమోదైన కేసులో బీఆర్ఎస్ నాయకులకు మంగళవారం బెయిల్ మంజూరైంది. క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా ఈ నెల 17న క్యాతన్‌పల్లి ఫ్లైఓవర్ సమీపంలో పోలీసులపై బీఆర్ఎస్ నాయకులు రాళ్ల దాడి చేసినట్టు ఓ కేసు నమోదు చేయగా, మంత్రి వివేక్ కాన్వాయ్‌పై బీఆర్ఎస్ నాయకులు రాళ్ల దాడి చేసినట్టు ఓ కాంగ్రెస్ లీడర్ ఇచ్చిన ఫిర్యాదుపై మరో కేసు నమోదు చేశారు.
గోపురాజం అనే కాంగ్రెస్ కార్యకర్త ఫిర్యాదు మేరకు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్, బీఆర్ఎస్ నాయకులు మూల రాజిరెడ్డి, రాజారమేశ్, అనిల్, మేడిపల్లి సంపత్, రవీంద్, చంద్రకిరణ్, రవీందర్‌రెడ్డి, దాసు, శివకుమార్, దినేశ్, సత్తయ్య, శ్రీలత, కుమార్, లక్ష్మీకాంత్, సంతోష్, అశోక్, ముస్తఫా, అరుణ్, సాగర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో హైకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ నాయకులకు స్టేషన్ బెయిల్ ఇస్తూ మంగళవారం ఆదేశాలిచ్చినట్టు తెలిసింది.