న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్న నేపథ్యంలో కేంద్రం కంటితుడుపు చర్యలకు దిగింది. విద్యా శాఖ కార్యదర్శి వినీత్ జోషిపై బదిలీ వేటు వేసింది. ఆయనను పంచాయతీ రాజ్ శాఖకు బదిలీ చేసింది. ఆయన స్థానంలో నరేశ్ పాల్ గంగ్వార్‌ను ఉన్నత విద్య కార్యదర్శిగా నియమించింది. ఈ మేరకు క్యాబినెట్ నియామకాల కమిటీ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పెద్దలను వదిలేసి అధికారులను బలిపశువులను చేస్తున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కేంద్ర మంత్రి ప్రధాన్‌ను పదవి నుంచి తొలగించాల్సిదేనని డిమాండ్ చేస్తున్నారు.