కాళేశ్వరం తెలంగాణకు జల ప్రాణేశ్వరం. కానీ దాని మీద కేసీఆర్ సంతకం ఉన్నది. కనుక ప్రాజెక్టును పండబెట్టాలి. తెలంగాణ పొలాలను ఎండబెట్టాలి. మన నీళ్లు పొరుగుకు పారాలి. మన పొలాలు బీడుగా మారాలి. అటు బడేభాయ్ని ఖుషీ చేయాలి. ఇటు గురువుకు దక్షిణ చెల్లించుకోవాలి. ఇదీ కూలేశ్వరుల వారి కుట్ర. ఇప్పుడా కుట్ర బట్టబయలైంది. నీళ్లు ఎత్తి పోయాలని అడిగితే ఎన్నెన్ని కహానీలు చెప్పారు? అన్ని అబద్ధాలూ అయిపోయిన తర్వాత, నెపం జాతీయ ఆనకట్ట భద్రతా ప్రాధికార సంస్థ (ఎన్డీఎస్ఏ) మీదికి నెట్టారు. మొన్నటికిమొన్న కాంగ్రెస్ సర్కార్ ఏం చెప్పింది? ఎన్డీఎస్ఏ వద్దన్నది కనుక నీళ్లు ఎత్తిపోయడం లేదని నంగనాచి కబుర్లతో ప్రజలను మోసం చేసింది. ఇప్పుడు కాళేశ్వరుని సాక్షిగా బండారం బద్దలైంది. కుట్రలు కుప్పకూలాయి. ఇన్నాళ్లూ ఎన్డీఎస్ఏ నివేదిక ముసుగులో ఆడిన నాటకాల ముసుగు తొలగిపోయింది. నీళ్లు ఎత్తిపోయడం నిర్ణయం రాష్ట్ర సర్కార్‌దేనని ఎన్డీఎస్ఏ తేల్చిచెప్పింది. కరువులో ఆ పని భేషుగ్గా చేసుకోవచ్చని స్పష్టంచేసింది. అంటే ‘రైతులకు నీళ్లు ఇవ్వాలంటే బరాజ్‌లు నింపుకోనూవచ్చు, ఎత్తిపోసుకోనూవచ్చు’ దీనిపై అంతిమ నిర్ణయం సర్కార్‌దే అని దీని సారాంశం. ‘నిద్రపోయే వాళ్లను మేల్కొల్పవచ్చు కానీ, నటించేవాళ్లను మేల్కొల్పలేము’ కదా! నీళ్లను ఎత్తిపోసే ఉద్దేశం లేని కాంగ్రెస్ పాలకులు అడ్డగోలు కహానీలు వినిపించారు.
అసలు కాళేశ్వరం ఆలోచన పుట్టిందే కరువును తరిమికొట్టేందుకు. గడ్డురోజుల్లో ఆదుకునే వరదాయిని ఈ కాళేశ్వరం. ఎల్ నినో ప్రభావంతో తెలంగాణలో వర్షాభావంతో ఇపుడు గడ్డు పరిస్థితులు తలెత్తాయి. నీళ్ల తడిలేక పొలాలు ఎండిపోతున్నాయి. మంచినీటికి కటకట మొదలైంది. ఈ కష్టాలన్నిటికీ పరిష్కారం కాళేశ్వరమేనని ఎంత మొత్తుకున్నా కాంగ్రెస్ సర్కార్ వినలేదు. శ్రీరాంసాగర్ తదితర ఎగువ ప్రాజెక్టుల వద్ద నీటి జాడలేదు. దిగువ గోదావరిలో మేడిగడ్డ, సమ్మక్క బరాజ్‌లలో తప్ప మరెక్కడా ప్రవాహాలు లేవు. గేట్లు ఎత్తకుండానే కనీసం వరద నీటిని ఎత్తిపోసేందుకైనా కన్నెపల్లి పంపులు ఆన్‌చేయాలని రైతులు కోరినా, బీఆర్ఎస్ పోరినా పాలక ప్రభుత్వం కదల్లేదు. పంపులకు పని చెప్పలేదు. దాంతో గోదావరి జలాలు దిగువకు సముద్రంలోకి, కాదు కాదు ఏపీలోకి పారుతున్నాయి. ఆ నీటిని ఒడిసిపట్టి ఏపీ సర్కార్ గోదావరి, కృష్ణా డెల్టాలకు మళ్లిస్తున్నది. ఆ ధీమాతో అక్కడి రైతులు నాట్లు వేస్తున్నారు. మరి మన రైతులు చేసిన పాపమేంది? తెలంగాణ సోయిలేని, సాగుమీద ధ్యాసలేని కాంగ్రెస్ సర్కార్‌ను ఎన్నుకోవడమేనా?
కాళేశ్వరంపై నేతలు పేలిన అవాకులూ, చవాకులూ ఇన్నీఅన్నీ కావు. తామే కావాలని పడావు పెట్టిన ప్రాజెక్టు నుంచి నీళ్లెత్తితే అది తెలంగాణ లైఫ్‌లైన్ అని చాటిచెప్పినట్టు అవుతుంది. ఆ కీర్తి అంతా కేసీఆర్ ఖాతాలోకే వెళ్తుంది. అందుకే రాజకీయ కక్కుర్తితో ప్రజాప్రయోజనాన్ని బలిపెట్టారు. నీటిహక్కులకు సమాధి కట్టేందుకు సిద్ధమయ్యారు. ఇన్నాళ్లూ పడావు పెట్టి ఇప్పుడు ఉన్నపళంగా నీళ్లిస్తే తాము ప్రచారం చేసిన అబద్ధాలకు తామే లెంపలు వేసుకున్నట్టు అవుతుందని నీళ్లు ఎత్తలేదు. ఇప్పుడు రాష్ట్రం వేగంగా దుర్భిక్షం వైపు అడుగులు వేస్తుంటే సీఎం రేవంత్‌రెడ్డి తీరు చూస్తుంటే నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి. విపక్ష బీఆర్ఎస్పై, విశేషించి కేసీఆర్‌పై అక్కసుతో ప్రజలను బలిపెట్టే తిక్కరాజకీయాలకు పాల్పడుతున్నారు. కాళేశ్వరం పేరెత్తితేనే తిట్ల దండకంలో తారస్థాయిని అందుకుంటున్నారు. కాళేశ్వరం నీళ్లు కావాలని అడిగితే బీఆర్ఎస్ నేతల రక్తాన్ని పొలాల్లో చల్లుకోవాలనేదాకా ఈ అడ్డూఅదుపు లేని ఉన్మా ద ధోరణి పోయింది. సమయం మించిపోతున్నది. టీఎంసీలకొద్దీ నీరు దిగువకు పరుగులు తీస్తున్నది. ఇప్పటికైనా సీఎం తన తీరుమార్చుకుని కాళేశ్వరం పంపులను నడిపించడంపై దృష్టి పెట్టాలి. లేకపోతే ప్రజలే తిరగబడి పంపులను నడిపించి నీళ్లు ఎత్తిపోసుకుంటరు.