– బీఆర్ఎస్, సీపీఎం సమన్వయ సమావేశంలో పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి
ఖమ్మం రూరల్, నవంబర్ 28 : అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అనతి కాలంలోనే ప్రజా వ్యతిరేకత మూటకట్టుకుందని, ప్రస్తుతం ఏ పల్లె చూసినా కేసీఆర్ పాలననే కోరుకుంటుందని పాలేరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నేత కందాల ఉపేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం రూరల్ మండలాధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్ అధ్యక్షతన పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన బీఆర్ఎస్, సీపీఎం పార్టీల సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా కందాలతో పాటు పాలేరు డివిజన్ సీపీఎం పార్టీ కార్యదర్శి బండి రమేశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కందాల మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన పేరుతో సమాజంలోని ప్రతి వర్గాన్ని దగా చేసిందని తీవ్రంగా మండిపడ్డారు. పాలేరు నియోజకవర్గంలో ప్రస్తుతం పరాయి పాలన కొనసాగుతుందని, ఇక్కడి ప్రజలను గెలిచిన నాయకులు ప్రజలుగా చూడటం మర్చిపోయారన్నారు. మట్టికి పోయిన ఇంటోడు ఉండాలని మన పెద్దవాళ్లు చెబుతుంటారని, ప్రస్తుతం పాలేరులో అదే పరిస్థితి కొనసాగుతుందన్నారు.
ఈ పాలనకు బుద్ధి చెప్పాలంటే రూరల్ ప్రజలు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. పంచాయతీ ఎన్నికల్లో రూరల్ మండలంలో బీఆర్ఎస్, సీపీఎం కలయిక చారిత్రాత్మకమన్నారు. 21 పంచాయతీల గాను 21 పంచాయతీల్లో జయకేతనం ఎగరవేయడం ఖాయమన్నారు. ఇప్పటికే అధికార పార్టీ అనేక సర్వేలు చేయించుకోవడం జరిగిందని, సర్వే రిపోర్టులు రాకముందు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన ఆ పార్టీ నాయకులు సర్వే రిపోర్ట్ లు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ప్రలోభాలకు గురిచేస్తున్నారన్నారు. తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలంటే ప్రతి పంచాయతీలో బీఆర్ఎస్, సీపీఎం బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించాల్సిన అవసరం ఉందన్నారు. నాటి బీఆర్ఎస్ పాలన అభివృద్ధి, సంక్షేమాన్ని, ప్రస్తుత ప్రజా వ్యతిరేక పాలనను ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. నామినేషన్లు వేయబోయే అభ్యర్థులు అన్ని రకాల ధ్రువీకరణ పత్రాలు సిద్ధం చేసుకోవాలని, గ్రామాల్లో ఇరు పార్టీల నాయకులు నిత్యం సమన్వయంతో మెలిగి సంపూర్ణ విజయం తీసుకురావాలన్నారు.

Khammam Rural : ‘ప్రతి పల్లె కేసీఆర్ పాలన కోరుకుంటుంది’
సీపీఎం పాలేరు డివిజన్ కార్యదర్శి బండి రమేశ్ మాట్లాడుతూ.. సీపీఎం, బీఆర్ఎస్ అభ్యర్థులు సమన్వయంతో పనిచేసి అపూర్వ విజయాలను సొంతం చేసుకోవాలని సూచించారు. అధికార కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక పాలనను ప్రజలకు క్షుణ్ణంగా వివరించాలన్నారు. గ్రామాభివృద్ధికి తయారు చేసిన ప్రణాళికను ప్రజల ఆమోదంతో తయారుచేసి ప్రతి ఇంటికి వెళ్లి తాము గెలిస్తే గ్రామాభివృద్ధికి ఎలా పాటుపడతామో వివరించాలన్నారు. ఈ సమావేశంలో మాజీ జడ్పీటీసీ ఎండపల్లి ప్రసాద్, సీపీఎం జిల్లా నేత నండ్ర ప్రసాద్, మండల కార్యదర్శి ఊరడి సుదర్శన్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ పెరుమళ్లపల్లి మోహన్ రావు, ఆయా గ్రామాల బీఆర్ఎస్, సీపీఎం నాయకులు పాల్గొన్నారు.

Khammam Rural : ‘ప్రతి పల్లె కేసీఆర్ పాలన కోరుకుంటుంది’