Power tussle : కర్ణాటక (Karnataka) లో ముఖ్యమంత్రి పదవి (CM Post) పై వివాదం మరింత ముదిరింది. సీఎం సిద్ధరామయ్య (CM Siddaramaiah), డిప్యూటీ సీఎం (Deputy CM) డీకే శివకుమార్ (DK Shivakumar) మధ్య మాటల యుద్ధం మొదలైంది. సోషల్ మీడియా (Social media) వేదికగా ఆ ఇద్దరూ ఒకరిపై మరొకరు పరోక్ష విమర్శలు చేసుకున్నారు. దాంతో వారి మధ్య నిగూఢంగా సాగిన విభేదాలు బహిర్గతమయ్యాయి. ఫలితంగా కాంగ్రెస్ అధిష్ఠానం రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నాలు మొదలుపెట్టింది.
డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ గురువారం ఎక్స్ వేదికగా చేసిన ఓ పోస్టు వివాదానికి ఆజ్యం పోసింది. ‘మాటకు ఉన్న శక్తే ప్రపంచ శక్తి. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే ప్రపంచంలో అతిపెద్ద బలం’ అని డీకే తన పోస్టులో పేర్కొన్నారు. 2023లో ప్రభుత్వం ఏర్పడినప్పుడు కుదిరినట్లుగా చెబుతున్న రెండున్నరేళ్ల అధికార మార్పిడి ఒప్పందాన్ని గుర్తుచేయడానికే డీకే ఈ పోస్టు పెట్టారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
అయితే డీకే పోస్టుకు సిద్ధరామయ్య కూడా అదే తరహాలో బదులిచ్చారు. ‘మాట ప్రజలకు మంచి చేయలేనప్పుడు ఆ మాటకు శక్తి ఉండదు’ అని కౌంటర్ ఇచ్చారు. తమ ‘శక్తి’ పథకం ద్వారా మహిళలకు 600 కోట్లకు పైగా ఉచిత ప్రయాణాలు అందించామని గుర్తుచేశారు. ప్రజలు తమకు ఐదేళ్ల పూర్తికాలానికి అధికారం ఇచ్చారని, తమ మాట నినాదం కాదని, అదే తమకు ప్రపంచమని స్పష్టంచేశారు.
కాగా, ఈ మాటల యుద్ధంపై కర్ణాటక బీజేపీ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ఇది శక్తి గురించి కాదని, కుర్చీ గురించేనని ఎద్దేవాచేసింది. అంతేకాదు డీకే శివకుమార్‌ను ట్యాగ్ చేయాలంటూ సిద్ధరామయ్యను ఉద్దేశించి పోస్ట్ చేసింది. ఈ క్రమంలో వివాదంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. సమస్య పరిష్కారానికి త్వరలోనే ఇద్దరు నేతలతో సమావేశం ఏర్పాటు చేస్తామని, సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో చర్చించాకే తుది నిర్ణయం ఉంటుందని స్పష్టంచేశారు.