కారేపల్లి, సెప్టెంబర్ 18 : పెరుగుతున్న ధరలకు అనుగుణంగా చాలిచాలని వేతనాలకు పని చేస్తున్న తమ కుటుంబాలు గడవలేని దీన పరిస్థితిలో ఉన్నాయని తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్ డైలీ వేజ్ వర్కర్స్ యూనియన్ నాయకుడు బొమ్మల అంజయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్లో పని చేస్తున్న డైలీ వేజ్, కాంటినిజెంట్ వర్కర్స్ ను పర్మినెంట్ చేసి పాత పద్ధతిలోనే జిల్లా కలెక్టర్ కె జెడ్ ప్రకారం వేతనాలు చెల్లించాలని కోరుతూ ఆ సంఘం ఆధ్వర్యంలో తలపెట్టిన నిరవధిక సమ్మె గురువారం ఏడవ రోజుకు చేరుకుంది.
ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలోని శాంతినగర్ ఆశ్రమ పాఠశాల ముందు ఏర్పాటు చేసిన దీక్ష శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత వారం రోజులుగా తమ సమస్యలను పరిష్కరించాలని సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కామేపల్లి, కారేపల్లి మండలాలకు చెందిన ఆశ్రమ పాఠశాలల దినసరి కార్మికులు పాల్గొన్నారు.