టేకులపల్లి, సెప్టెంబర్ 17 : రాష్ట్రంలో పదేళ్ల కాలంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతీ బీఆర్ఎస్ నాయకుడు, కార్యకర్తపై ఉన్నదని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియానాయక్ అన్నారు. బొమ్మనపల్లి, బోడు, బద్దుతండా పంచాయతీల్లో బుధవారం ఆమె విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ కార్యకలాపాలను మరింత పటిష్టం చేయాలని, పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పని చేయాలని కోరారు. రైతులకు యూరియా అందక సొసైటీలు, రైతు వేదికల వద్ద రైతులు నానా అవస్థలు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.
ఒక్క బస్తా యూరియా ఇవ్వడానికి పొద్దంతా పడిగాపులు కాసేలా చేస్తున్నదని మండిపడ్డారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వస్తోందని, ముఖ్యంగా రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నారు. ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. మోసాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. సమావేశాల్లో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బొమ్మెర వరప్రసాద్, నాయకులు బానోతు కిషన్, మాలోతు రాజేందర్, భూక్యా బాలకృష్ణ, శివకృష్ణ, బానోతు వాలు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.