న్యూఢిల్లీ: అన్ని మతాలను గౌరవిస్తానని సీజేఐ బీఆర్ గవాయ్ పేర్కొన్నారు. ఖజురహో ఆలయ సమూహంలో ఉన్న విష్ణు దేవుడి విగ్రహానికి చెందిన వివాదంపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద ఖజురహో ఆలయ సమూహంలో ఉన్న జవారి టెంపుల్లో ఏడు అడుగుల విష్ణుమూర్తి విగ్రహం ఉన్నది. అయితే ఆ విగ్రహాన్ని ధ్వంసం చేశారని, దాని స్థానంలో మరో విగ్రహాన్ని ప్రతిష్టించాలని సుప్రీంకోర్టులో పిల్ వేశారు. ఆ పిల్‌పై మంగళవారం వాదనలు జరిగాయి. ఆ సమయంలో చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
రాకేశ్ దలాల్ అనే వ్యక్తి పిటీషన్ వేశారు. మొఘల్ రాజుల కాలంలో డ్యామేజ్ అయిన విగ్రహాన్ని తొలగించి కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. అయితే సీజేఐ గవాయ్ ఆ పిల్‌పై స్పందిస్తూ.. ఇది నిజమైన పిల్ అని, ఏదైనా చేయమని వెళ్లి ఆ దేవుడినే అడుగు అని, విష్ణుభగవానుడికి వీర భక్తుడిని అని చెప్పుకుంటున్నావు కదా, అయితే పూజలు, ప్రార్థనలు చేయమని సీజేఐ అన్నారు. ఆ ఆలయం పురావస్తు శాఖ ఆధీనంలో ఉందని, కొత్త విగ్రహ ప్రతిష్టాపనకు పురావాస్తుశాఖ అనుమతి అవసరమని, ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నట్లు సీజేఐ తెలిపారు.
ఒకవేళ నువ్వు శైవానికి వ్యతిరేకం కాదనుకుంటే, ఖజురహో ఆలయ సమూహంలోనే పెద్ద శివలింగం ఉన్నదని, అక్కడకి వెళ్లి పూజలు చేయాలని పిటీషనర్ను సీజేఐ గవాయ్ కోరారు. ఖజురహో ఆలయంపై తాను చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో తప్పుదోవ పట్టించారని సీజేఐ గవాయ్ అన్నారు. అన్ని మతాలను గౌరవిస్తానని ఆయన చెప్పారు.