రాయపర్తి, డిసెంబర్ 21 : గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు వచ్చిన ఫలితాలను చూసి రేవంత్‌రెడ్డి మైండ్ బ్లాక్ అయిందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆదివారం వరంగల్ జిల్లా రాయపర్తిలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మండల పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అదేవిధంగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్, వార్డు సభ్యులను సన్మానించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడు తూ ఎన్నికలకు ముందు రేవంత్‌రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో అట్టర్ ఫ్లాప్ అయ్యారని అన్నారు.
ఆరు గ్యారెంటీలు, 420 అబద్ధపు హామీలతో కొలువుదీరిన రేవంత్ సర్కార్ గడిచిన రెండేళ్లలో ప్రజలకు చేసింది శూన్యమన్నారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటు బ్యాంకు గణనీయంగా పెరిగందని, ప్రజలు గులాబీ జెండానే విశ్వసిస్తున్నారని చెప్పారు. బీఆర్ఎస్ ఫలితాలతో రేవంత్ సర్కార్ రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించే ధైర్యం చేయడం లేదన్నారు. పార్టీ శ్రేణులు నిత్యం ప్రజలకు అందుబాటు లో ఉంటూ కష్టసుఖాల్లో భాగస్వాములు కావాలన్నా రు.
ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, గెలిచిన వారు నేర్పు, ఓడిన వారు ఓర్పుతో ముందుకు సాగాలని హితవు పలికారు. గ్రామాల అభివృద్ధి కోసం నిబద్ధతతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజల పక్షాన నిలబడి కొట్లాడి నిధులు సాధించుకుందామని పేర్కొన్నారు. అనంతరం పంచాయతీ ఎన్నికల్లో విజేతలుగా నిలిచిన నూతన ప్రజాప్రతినిధులను ఆయన శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు. సమావేశంలో పార్టీ జిల్లా నాయకుడు పరుపాటి శ్రీనివాస్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు మునావత్ నర్సింహానాయక్, నాయకులు జినుగు అనిమిరెడ్డి, రంగుకుమార్, పూస మధు, కుందూరు రాంచంద్రారెడ్డి, జాజునాయక్, బాలరాజు, నర్మద పాల్గొన్నారు.