రామాయంపేట, డిసెంబర్ 21: తన తండ్రి సర్పంచ్‌గా గెలిస్తే భిక్షాటన చేసిమొక్కు తీర్చుకుంటానని కుమారుడు మొక్కుకున్నాడు. తండ్రి గెలవడంతో కుమారుడు మొక్కుతీర్చుకున్నాడు. వివరాలు.. మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఝాన్సీలింగాపూర్ సర్పంచ్‌గా మానేగల్ల రామకిష్టయ్య పోటీచేశారు. అతనిపై పెద్ద కుమారుడు సర్పంచ్‌గా పోటీచేశారు. తండ్రీకొడుకుల పోటీలో తండ్రినే విజయం వరించింది. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తండ్రి మానేగల్ల రామకిష్టయ్య తరపున అతని చిన్నకుమారుడు భాస్కర్ గ్రామంలో విస్తృతంగా ప్రచారం చేశాడు.
హైదరాబాద్‌లో జాబ్‌కు సెలవు పెట్టి వచ్చి మరీ ప్రచారం చేశాడు. తన తండ్రిని గెలిపిస్తే గ్రామాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తామని ఓటర్లను వేడుకున్నాడు. తన తండ్రి సర్పంచ్‌గా గెలిస్తే తాను గ్రామంలో భిక్షాటన చేసి కర్ణాటకలోని గానుగాపూర్ దత్తాత్రేయ స్వామికి మొక్కు తీర్చుకుంటానని భాస్కర్ మొక్కుకున్నాడు. తండ్రి సర్పంచ్‌గా గెలువడంతో భాస్కర్ రెండు రోజులుగా గ్రామంలో భిక్షాటన చేశాడు. పది మందికి సాయం చేసే మానేగల్ల రామకిష్టయ్య కుటుంబానికి చెందిన భాస్కర్ తమ ఇంటికి భిక్షాటనకు రావడం చూసి గ్రామస్తులు భావోద్వేగానికి లోనయ్యారు.
భాస్కర్ తన ఇంటికి వెళ్లగా తండ్రి సర్పంచ్ మానెగల్ల రామకిష్టయ్య సైతం భిక్షం వేశాడు. మానెగల్ల రామకిష్టయ్యకు పోటీగా గ్రామంలోనే కొంతమంది యువకులు అతని రెండో కుమారుడు వెంకటేశ్‌తో సర్పంచ్‌గా నామినేషన్ వేయించారు.అతను గట్టి పోటీ ఇచ్చినా తండ్రి రామకిష్టయ్యనే విజయం వరించింది. రామకిష్టయ్య రెండు పర్యాయాలు సర్పంచ్‌గా గ్రామానికి విశిష్ట సేవలు అందించారు. మూడోసారి గెలిస్తే ఆడపిల్ల పెండ్లికి రూ.11వేలు, ఆడపిల్ల పుడితే రూ.5వేలు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానని గ్రామస్తులకు ఆయన హామీ ఇచ్చాడు.గతంలో సైతం ఎంతోమంది ఆడపిల్లకు పెండ్లిలు చేశాడు. అనారోగ్యానికి గురైన వారికి ఆర్థిక సాయం చేశాడు.