సూర్యాపేట, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ) : రెండేళ్ల తరువాత జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్‌లకు ఆయా పంచాయతీల్లో సమస్యలు, రెండేళ్లుగా చేసిన అప్పులు స్వాగతం పలుకనున్నాయి. బీఆర్ఎస్ సర్కార్ ఉన్నన్నాళ్లూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 1782 మేజర్, మైనర్ పంచాయతీలకు పల్లె ప్రగతి పేరిట నెలనెలా రూ.99 నుంచి రూ.15 కోట్ల వరకు అందించగా నాటి సర్పంచ్‌లు అన్ని మౌలిక వసతులు కల్పించారు. కానీ గత రెండేళ్లుగా కాంగ్రెస్ సర్కార్ ఎన్నికలు నిర్వహించకపోవడం, నయాపైసా నిధులు విడుదల చేయకపోవడంతో పంచాయతీ సెక్రటరీలు చేసిన అప్పులు తలకు మించిన భారంగా పరిణమించాయి.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు రూ.140 కోట్లపైనే అప్పు ఉంది. ఇలాంటి నేపథ్యంలో కొత్త సర్పంచ్‌లకు అభివృద్ధి అనేది సవాల్‌గా మారనుంది. సీసీ రోడ్లు, డైనేజీల వంటి అభివృద్ధి పనులకు నోచుకోకపోవడంతో పాటు పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డుల నిర్వహణ, కరెంటు బిల్లులు, తరచుగా వచ్చే మోటార్ల మరమ్మతులు, ట్రాక్టర్ల నిర్వహణ ఖర్చులు నూతన పాలక వర్గాలకు ఆర్థికంగా పెను భారంగా పరిణమించబోతోంది. ఇక ఏమైనా కేంద్ర ఆర్థిక సంఘం నిధుపైనే కొత్త పాలక వర్గాల ఆశలు పెట్టుకున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్ల అనంతరం రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికలు నిర్వహించింది. చివరగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన పంచాయతీ ఎన్నికల పదవీ కాలం 2024 జనవరితో ముగిసింది. నాటి నుంచి ఇప్పటి వరకు ప్రత్యేకాధికారుల పాలనలో కొనసాగుతూ వచ్చాయి. పాలకవర్గాలు లేక పోవడంతో 15వ ఆర్థిక సంఘం నుంచి పంచాయితీలు సహా పరిషత్‌లకు గత రెండేళ్లుగా నయాపైసా రాలేదు. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక్క పైసా కూడా ఇవ్వకపోవడంతో పంచాయతీలు ఆర్థిక భారంతో అభివృద్ధికి ఆమడ దూరంలో కొట్టుమిట్టాడుతున్నాయి. పంచాయతీల్లో ఆస్తి పన్నులు కూడా ఆశించిన స్థాయిలో వసూలు కాలేదు. తండాలు, ఇతర చిన్న పంచాయతీల్లో అయితే పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు కూడా ఇవ్వలేని దుస్థితి నెలకొంది.
నాడు నెలనెలా రూ.25 కోట్లు..
బీఆర్ఎస్ హయాంలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లె ప్రగతి పేరిట ప్రతి నెలా మేజర్, మైనర్ పంచాయతీలకు నెలనెలా నిధులు ఇచ్చేది. సూర్యాపేట జిల్లాకు నెలనెలా దాదాపు రూ.8 నుంచి రూ.13 కోట్లు రాగా నల్లగొండకు రూ. 15 నుంచి రూ.17 కోట్లు యాదాద్రి భువనగిరి జిల్లాకు రూ.5 నుంచి రూ.7 కోట్ల వరకు వచ్చేది. ఇలా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 1782 పంచాయతీలకు ప్రతినెలా రూ. 28 నంచి రూ.37 కోట్ల వరకు వచ్చేది. వీటితో పంచాయతీలకు కావాల్సిన అన్ని మౌలిక సదుపాయల కల్పన జరిగింది. పదేండ్ల బీఆర్ఎస్ హయాంలో పల్లెలు పచ్చగా మారిపోయాయి.
ఇక గత రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సంఘం నిధులు రాకపోవడం మరో పక్క రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో పల్లెలు కునారిల్లిపోయాయి. నేడు మైనర్ పంచాయతీలకు రూ.5 నుంచి 6 లక్షలు, మేజర్ పంచాయతీలకు రూ.9 నుంచి 15 లక్షల అప్పు ఉన్నట్లు తెలుస్తుండగా కొన్ని గ్రామాల్లోనైతే ఏకంగా 25 నుంచి 50 లక్షల అప్పు ఉంది. ఇక నేడు కొత్త పాలకవర్గాలు ప్రమాణ స్వీకారం చేయబోతుండగా నిధులు ఎలా..? అభివృద్ధి ఏ రీతిన చేయాలి..? ప్రజలు గత బీఆర్ఎస్ హయాంలో సర్పంచ్‌లు చేసిన పనులను బేరీజు వేసుకుంటారు కాబట్టి నిధులు ఎలా సమకూర్చాలనేది కష్టతరంగానే ఉందని ఓ పంచాయతీ అధికారి చెబుతున్నారు..? కేవలం 15వ ఆర్థిక సంఘం నిధులపైనే ఆధారపడటం తప్ప మరో మార్గం కూడా లేదని ఓ అధికారి పేర్కొన్నారు.