హయత్‌నగర్, డిసెంబర్ 21 : హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్‌మెన్ తన ఇంటిలో గన్‌తో కాల్చుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యు లు వెల్లడించారు. బెట్టింగ్ యాప్‌ల్లో పెట్టుబడులు పెట్టి ఆర్థిక ఇబ్బందులో కూరుకుపోవడమే ఆత్మహత్యాయత్నానికి ప్రధాన కారణమని అధికారులు అనుమానిస్తుండగా.. తమ కొడుకుకు ఆర్థిక సమస్యలేమి లేవని బాధితుడి తండ్రి పేర్కొన్నారు.
హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలు పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం, మునగనూరు, సాయి సూర్యనగర్, రోడ్డు నం.3లో 2020బ్యాచ్‌కు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ ముత్యాలపాయటి కృష్ణ చైతన్య(32), భార్యతో కలిసి నివాసముం టున్నాడు. సమీపంలోనే అతని తల్లిదండ్రులు నివాసముం టున్నారు. కాగా.. కృష్ణచైతన్య ప్రస్తుతం హైడ్రా కమిషనర్ రంగనాథ్ వద్ద గన్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం ఉదయం 6.30 గంటల సమయంలో భార్య ఇంటి పనుల్లో నిమగ్నమై ఉండగా.. కృష్ణచైతన్య గదిలో తన వద్ద ఉన్న పిస్టల్‌తో కాల్చుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం అతన్ని ఎల్బీనగర్లోని కామినేని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ కామినేని ఆస్పత్రికి వెళ్లి కృష్ణ చైతన్యకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులు, ఆస్పత్రి యాజమాన్యానికి సూచించారు. వైద్యానికి హైడ్రా చేయూత అందిస్తుందని బాధితుడి కుటుంబ సభ్యులకు హైడ్రా కమిషనర్ హామీ ఇచ్చారు. తలలోకి బుల్లెట్ దూసుకుపోవడంతో న్యూరో సర్జన్స్ డాక్టర్ ఎంఏ జలీల్, డాక్టర్ సాయి శివ ఆధ్వర్యంలో కృష్ణ చైతన్యకు సర్జరీ చేశారు. 48 గంటల అనంతరం అతడి ఆరోగ్య పరిస్థితిపై వివరిస్తామని వైద్యులు వెల్లడించారు.
వ్యక్తిగత, ఆర్థిక సమస్యలతోనే కృష్ణచైతన్య ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించినట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. రెండేళ్ల క్రితం బెట్టింగ్, గేమింగ్ యాప్స్‌ల్లో కృష్ణ చైతన్య పెట్టుబడులు పెట్టి తీవ్రంగా నష్టపోయినట్టు సమాచారం ఉందన్నారు. అప్పుల కారణంగా ఆయనకు వచ్చే జీతంలో అధిక భాగం కట్ అవుతుందని తెలిపారు. వ్యక్తిగత, ఆర్థిక సమస్యలతో మూడు నెలల క్రితం ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయా డని, కుటుంబ సభ్యులు హయత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారని వివరించారు.
ఫిర్యాదు ఇచ్చిన తరువాత కృష్ణచైతన్య తిరిగి ఇంటికి వచ్చాడని వివరించారు. విధులపట్ల అతడు అప్రమత్తంగా ఉం డడంతోపాటు ఎలాంటి ఇబ్బందులు లేవని, అధికారుల తోపాటు తోటి సిబ్బందితో మర్యాదగా, గౌరవంగా ఉంటూ విధులు ని ర్వహిస్తున్నాడని వెల్లడించారు. మానసిక ఒత్తిడి, ఆరోగ్య సమస్యల కారణంగా కృష్ణ చైతన్య నాడి సంబంధిత వ్యాధితో బాధపడుతు న్నాడని తెలిపారు. తలలో రక్తం గడ్డకట్టడంతో వైద్యు లు చికిత్స అందిస్తున్నారు. కృష్ణ చైతన్య ఆత్మహత్యాయత్నానికి ఆర్థిక ఇబ్బం దులా.? లేక అధికారుల వేధింపులు కారణమా.? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు.
తన కొడుకుకు ఆర్థిక సమస్యలేమి లేవని కృష్ణచైతన్య తండ్రి రాంప్రసాద్ తెలిపారు. దవాఖాన వద్ద మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పాడు. తమకు హైడ్రా నుంచి పూర్తి సహాయ సహకారాలున్నాయని వెల్లడించారు. ప్రమాదవశాత్తూ గన్ పేలి ఉంటుందని ఆత్మహత్యాయత్నం కాకపోవచ్చని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. దీంతో ఆత్మహత్యాయత్నం చేశాడా? ప్రమాదవశాత్తూ జరిగిందా? అనే విషయాలు విచా రణలో తేలాల్సి ఉంది.