– సింగరేణి ఓసీ విస్తరణలో వెంకటేష్ ఖని గ్రామం మాయం
– తలో దిక్కుకు గ్రామస్తులు
– రెండో విడుతలో అక్కడ పోలింగ్ నిర్వహణ
– జనం, ఓటర్లు లేని చోట ఎన్నికలు ఎలా అని అంతా విస్మయం
భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 12 : సింగరేణి ఓసీ విస్తరణలో అక్కడ ఊరు మాయం అయింది. దీంతో అక్కడ ఉన్న కుటుంబాలు తలోదిక్కయ్యాయి. కానీ ఇప్పుడు ఆ గ్రామానికి ఎన్నికలు వచ్చాయి. మరి ఎవరు పోటీ చేస్తున్నారు. ఎవరు బరిలో ఉన్నారు. పోటీ చేసే అభ్యర్ధులు ప్రచారం ఎక్కడ చేస్తున్నారు అనేది విచిత్ర పరిస్థితి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం వెంకటేష్ ఖని గ్రామం. అక్కడ 183 జనాభా, 179 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 79 కుటుంబాలు. గత మూడేళ్ల క్రితం ఆ గ్రామం ఓపెన్ కాస్ట్ ద్వారా బొగ్గు వెలికితీత కోసం సింగరేణి ఓసీ ఏర్పాటు చేయబోతుంది. దీంతో ఆ గ్రామాన్ని అధికారులు ఖాళీ చేయించాల్సి వచ్చింది. అప్పటికే చాలామంది తలోదారి చూసుకున్నారు. కానీ సింగరేణి కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో కొంత స్థలాన్ని వారికి కేటాయించడంతో ప్రభుత్వం వారికి స్థలాలను ఇచ్చింది. అయితే ఇంటి నిర్మాణాలు జరగలేదు. దీంతో అక్కడ ఉన్న కుటుంబాలు వేరే ప్రాంతాలకు తరలి వెళ్లిపోయాయి. ఎక్కడ ఉంటున్నారంటే కొంత మంది అడ్రస్ తెలిసినా మరికొంత మంది అడ్రస్ తెలియడం లేదు.
మూడేళ్ల క్రితమే అక్కడ ఊరు లేదు. కుటుంబాలు చుంచుపల్లి మండలంతో పాటు పట్టణ ప్రాంతాల్లో అద్దె నివాసాల్లో ఉంటున్నట్లు అధికారులు గుర్తించారు. కాని పూర్తి సమాచారం అధికారుల వద్ద లేదు. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు వచ్చాయి. అధికారులు తప్పిదంతో వాళ్లకి ఓట్లు కూడా వచ్చేశాయి. కాని అక్కడ ఊరు లేదు. నాయకులకు పదవులు కావాలి కాబట్టి సర్పంచ్, వార్డు మెంబర్లకు పోటీ చేసేందుకు ఓటర్ల జాబితాలో వ్యక్తులను రప్పించుకుని నామినేషన్లను వేయించారు. సర్పంచ్ పదవికి ముగ్గురు, 4 వార్డులకు 10 మంది అభ్యర్థులను బరిలో ఉంచారు. రెండవ విడత పోలింగ్ జరగాల్సి ఉంది. ఓటర్లు ఎక్కడ ఉన్నారో తెలియదు. ప్రచారం ఎవరు ఎక్కడ చేస్తున్నారో తెలియదు. మరి పోలింగ్ రోజు ఈ 14వ తేదీన ఓటర్లను ఎవరు తీసుకు వస్తారంటే ఎవరికి అంతుచిక్కని విషయం.
అసలు అక్కడ ఊరు లేదు. కాని ఓటర్ల జాబితాలో మాత్రం అక్కడ ఓటర్లు ఉన్నట్లు లెక్కలు చూపిస్తున్నారు. మూడేళ్ల క్రితం అక్కడ నుండి జనం బయటకు వెళ్లిపోతే ఓటర్ల సవరణలో వాళ్లను ఎందుకు వేరే ప్రాంతాలకు షిఫ్ట్ అయినట్లు చూపించలేదో అర్ధంకాని విషయం. మరి అధికారులకు తెలుసా లేక అసలు అధికారులు ఆ గ్రామానికి ఇంత వరకు వెళ్లలేదా. ఎన్నికల అధికారులు చేర్పులు మార్పుల సవరణలో వారి విషయం ఎందుకు మరిచి పోయారో అంతుచిక్కని విషయంగా మిగిలిపోయింది. నాయకులు పంచాయతీని దక్కించుకోవడం ఓటర్లను అక్కడ ఉంచారా లేక పంచాయతీకి నిధులు వస్తే మింగేయాలనా అర్ధంకాని విషయం. ఎవరూ లేనప్పుడు అక్కడ పంచాయతీ సెక్రటరీ ఎందుకని ఇలాంటి ఎన్నో చిక్కు సమస్యలు జనం మదిలో మెదులుతున్నాయి.
మేమంతా రామవరంలో ఉంటున్నాం. మా ఓట్లు మాత్రం వెంకటేష్ ఖని పంచాయతీలో ఉన్నాయి. అసలు ఏ ఒక్కరు కూడా లేని గ్రామంలో ఎన్నికలు నిర్వహించడం విడ్డూరంగా ఉంది. ఒకవేళ గెలిచిన అభ్యర్థి జన నివాసం లేని గ్రామంలో ఏం అబివృద్ధి పనులు చేయిస్తాడు. అధికారులు అన్ని విషయాలు ఆలోచించి ఎన్నికలు రద్దు చేస్తే బాగుండేది.
మేమంతా ఓటు హక్కును వినియోగించుకునేందుకు 7 ఇంక్లైన్ కు వెళ్తున్నాం. మేమంతా ఎక్కడ నివసిస్తున్నామో ఆ ప్రాంతాన్ని అబివృద్ధి చేస్తే బాగుంటుంది. గంగాబిషన్ బస్తీలో ఇందిరమ్మ ఇళ్లతో పాటు తాగునీటి సమస్య కూడా తీవ్రంగా ఉంది. ఓటు హక్కును వినియోగించుకోవడానికే వెళ్తున్నా. కానీ మాకు ఇక్కడ అభివృద్ధి చేయడానికి అది ఉపయోగపడదు కదా.
సర్పంచ్ స్థానానికి ముగ్గురు, వార్డుకు పది మంది సభ్యులు పోటీ పడుతుండగా ఒక వార్డు ఏకగ్రీవమైంది. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 14వ తేదీ ఆదివారం నాడు జరిగే పంచాయతీ ఎన్నికలకు వివిధ ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను సింగరేణి యాజమాన్యమే బస్సులు ఏర్పాటు చేసి ఓటు వేసేందుకు తరలిస్తారని చెబుతున్నారు.
కాగా మూడేండ్ల క్రితం నుండే ఇక్కడ జనం లేనపుడు ఓట్లు ఎందుకు షిఫ్ట్ చేసుకోలేదని అడగగా వారి వద్ద సమాధానం లేదు.

Bhadradri Kothagudem : జనమే లేని ఊరిలో ఎన్నికలు