Adulterated Honey | తేనెను తీసుకోవడం వల్ల మనకు ఎలాంటి ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. ఎన్నో రకాల విటమిన్లు, మినరల్స్, పోషకాలకు తేనె నిలయం. పలు అనారోగ్యాలను తగ్గించడంలో, శరీరానికి శక్తినివ్వడంలో తేనెకు అధిక ప్రాధన్యత ఉంది. ఆయుర్వేదంలోనూ తేనెను పలు ఔషధాలతోపాటుగా ఇస్తారు. అయితే ప్రస్తుత తరుణంలో తేనె వాడకం ఎక్కువవడంతో వ్యాపారులు దాన్ని కూడా కల్తీ చేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో ప్రజలకు స్వచ్ఛమైన తేనె ఏదో నకిలీ తేనె ఏదో గుర్తించడం కష్టతరమైంది. అయితే పలు సూచనలు పాటిస్తే నకిలీ తేనెను ఇట్టే గుర్తించవచ్చు. దీంతో ఆరోగ్యంపై ప్రభావం పడకుండా జాగ్రత్తగా ఉండవచ్చు.
మీరు కొన్న తేనె అసలుదో, నకిలీదో గుర్తించాలంటే దాన్ని ఒక టేబుల్ స్పూన్ మోతాదులో తీసుకుని ఒక గ్లాస్ నీటిలో వేయాలి. నకిలీ తేనె అయితే వెంటనే నీటిలో కరుగుతుంది. అసలు తేనె గ్లాస్ అడుగు భాగంలోకి చేరుతుంది. అంతే తప్ప నీటిలో అంత త్వరగా కరగదు. అలాగే ఒక కాటన్ బాల్‌ను తీసుకుని దాన్ని తేనెలో ముంచాలి. అనంతరం దానికి అగ్గిపుల్లతో నిప్పు పెట్టాలి. అసలు తేనె అయితే కాటన్ బాల్ మండుతుంది. నకిలీ తేనె అయితే కాటన్ బాల్ మండదు. అదేవిధంగా ఒక తేనె చుక్కను గోరుపై వేసుకోవాలి. ఆ చుక్క గోరుపై అటు ఇటు కదిలితే అది నకిలీ తేనె అన్నమాట. అదే ఆ చుక్క కదలకుండా స్థిరంగా ఉంటే ఆ తేనెను అసలైందిగా భావించాలి.
ఇక సాధారణంగా మొలాసిస్, మొక్కజొన్న పిండి తదితర పదార్థాలను ఉపయోగించి నకిలీ తేనెను తయారు చేస్తారు. ఈ క్రమంలో నకిలీ తేనెను గుర్తించడం చాలా సులభమే అని చెప్పవచ్చు. కొద్దిగా తేనె తీసుకుని దానికి 2, 3 చుక్కల వెనిగర్ ఎస్సెన్స్ కలపాలి. అనంతరం వాటిని బాగా మిక్స్ చేయాలి. ఇలా వచ్చిన మిశ్రమం ఎక్కువగా నురగను విడుదల చేస్తుంటే దాన్ని నకిలీ తేనెగా గుర్తించాలి. ఎందుకంటే నకిలీ తేనె కోసం ఉపయోగించే పదార్థాల్లో చక్కెర కూడా ఉంటుంది. ఇది వెనిగర్‌తో కలిసినప్పుడు నురగలాంటి ద్రవాన్ని ఇస్తుంది. అసలైన తేనె ఇలా నురగను ఇవ్వదు. అలాగే కొద్దిగా తేనెను తీసుకుని బొటనవేలిపై వేయాలి. అనంతరం దాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. ఆ తేనె చుక్క వేలిపై చుట్టూ విస్తరిస్తే దాన్ని నకిలీ తేనెగా గుర్తించాలి.
ఇక సాధారణంగా స్వచ్ఛమైన తేనె అయితే అసలు ఎక్స్పైరీ ఉండదు. కానీ మనకు మార్కెట్లో లభించే తేనెలో కొందరు రసాయనాలు కలుపుతారు. కనుక మనం కొనే తేనెకు ఎక్స్పైరీ ఉంటుంది. కానీ సహజసిద్ధంగా కొన్న తేనె అయితే ఎన్ని రోజులు ఉన్నా పాడవదు. రోజులు గడిచే కొద్దీ ఇంకా రుచి పెరుగుతుంది. మార్కెట్లో మీరు తేనె కొంటే వీలైనంత వరకు బ్రాండెడ్ కంపెనీలకు చెందిన తేనె అయితే మంచిది. అది కల్తీ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఇలా పలు సూచనలు పాటిస్తే నకిలీ తేనెను గుర్తించడంతోపాటు దాన్ని కొనకుండా జాగ్రత్త పడవచ్చు.