కారేపల్లి, డిసెంబర్ 12 : ఎన్నికల విధులు నిర్వహిస్తూ సొమ్మసిల్లి పడిపోయి దవాఖానలో చికిత్స పొందుతూ అంగన్వాడీ టీచర్ మృతి చెందిన సంఘటన శుక్రవారం ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలో చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సింగరేణి మండలం బాజుమల్లాయిగూడెం అంగన్వాడీ కేంద్రంలో టీచర్‌గా పని చేస్తున్న వనపట్ల విజయ కుమారి(51)కి మొదటి విడత పంచాయతీ ఎన్నికలలో భాగంగా కొనిజర్ల మండలం డ్యూటీ పడింది. దాంతో ఈనెల 10వ తేదీన ఎలక్షన్ విధుల కోసం కొనిజర్ల మండలం వెళ్లింది.
ఎన్నికల విధులు పాల్గొన్న ఆమె స్పృహ తప్పి కింద పడిపోవడంతో సంబంధిత అధికారులు ఖమ్మం హాస్పిటల్‌కు తరలించారు. దవాఖానలో చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో శుక్రవారం మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. మృతురాలికి భర్త, కుమార్తె ఉన్నారు. ఇదిలా ఉండగా ఎన్నికల విధులు నిర్వహిస్తూ అనారోగ్యానికి గురై చనిపోయిన అంగన్వాడీ టీచర్ కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ స్థానికులు గ్రామంలో ఆందోళన చేపట్టారు.