IND Vs SA | ముల్లాన్‌పూర్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో భారత్ ఘోర పరాజయం పాలైంది. 51 పరుగుల తేడాతో మ్యాచ్‌ను కోల్పోయిన టీమిండియాకు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఫామ్ ఆందోళన కలిగిస్తున్నది. ఇద్దరు వరుసగా విఫలమవుతున్న నేపథ్యంలో పలువురు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోస్చేట్ మాత్రం ఇద్దరు ప్లేయర్లను సమర్థించాడు. ఇద్దరు ప్లేయర్స్‌తో జట్టుకు ముప్పు లేదని.. త్వరలోనే ఫామ్‌లోకి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ముల్లాన్‌పూర్ మ్యాచ్‌లో సూర్యకుమార్ 5 పరుగులు, శుభ్‌మన్ గిల్ డకౌట్‌గా వెనుదిరిగాడు. కీలకమైన టీ20 ప్రపంచకప్‌కు ముందు ఇద్దరి ఫామ్‌లో లేకపోవడంతో జట్టు మేనేజ్మెంట్ను కలవరానికి గురి చేస్తున్నది. కానీ, అసిస్టెంట్ కోచ్ దీన్ని తోసిపుచ్చాడు.
రెండు మ్యాచుల్లోనే వైఫల్యాలను అతిగా చేయాల్సిన అవసరం లేదని డోస్చేట్ పేర్కొన్నారు. గిల్ బ్యాటింగ్‌ను సమర్థిస్తూ.. తొలి మ్యాచ్‌లో పవర్ ప్లేలోనే బౌలర్లపై ఎదురుదాడి చేయాలని చెప్పామని.. కటక్ వికెట్ అంత బాగాలేదని.. కాబట్టి దాన్ని విస్మరిస్తున్నట్లు తెలిపారు. రెండు మ్యాచ్‌లో లుంగి ఎన్గిడి వేసిన అద్భుతమైన డెలివరీకి గిల్ అవుట్ అయ్యాడని.. మంచి ఫామ్‌లో లేనప్పుడు అలాంటి డెలివరీలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పుకొచ్చాడు. సూర్య, గిల్‌కు మద్దతు తెలుపుతూ వారి క్లాస్ తమకు తెలుసునని.. ఇద్దరి ఐపీఎల్ రికార్డులను ఒకసారి చూడాలని సూచించారు.
స్థిరంగా 700-800 పరుగులు చేస్తున్నారని.. ఇద్దరిపై పూర్తి నమ్మకం తెలిపాడు. జట్టు ప్రణాళిక, సెటప్‌లో గణనీయమైన పురోగతిని సాధించామని.. నాణ్యమైన ఆటగాళ్లు, కెప్టెన్లకు మద్దతు ఇవ్వాలన్నారు. బయటి నుంచి ఆందోళన ఉండొచ్చని.. సరైన సమయంలో ఇద్దరు తమ ఆటతోనే బదులిస్తారని తాము నమ్ముతున్నామన్నారు. 2024 టీ20 ప్రపంచ కప్ నుంచి సూర్యకుమార్ 26 ఇన్నింగ్స్‌లలో 18.73 సగటుతో 431 పరుగులు చేశాడు. 2025లో టీ20 జట్టులోకి తిరిగి వచ్చినప్పటి నుంచి గిల్ 14 ఇన్నింగ్స్‌లలో 263 పరుగులు చేశాడు. ఇందులో ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు. అయినప్పటికీ ఇద్దరి ఆటగాళ్ల సామర్థ్యాన్ని బట్టి చూస్తే ఫామ్ గురించి ఆందోళన అవసరం లేదన్నాడు.
ఇంగ్లండ్‌లో కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత గిల్‌పై ప్రభావం చూపిందని.. అతిగా ఆలోచించడం మొదలుపెట్టి ఉండవచ్చని డోస్చేట్ అంగీకరించారు. ఇంగ్లండ్‌లో శుభ్‌మాన్ కెప్టెన్‌గా, జట్టును గర్వంగా నడిపించిన విధానం టీ20లపై సైతం కొంత ప్రభావం చూపించిందని.. దాంతో స్వేచ్ఛగా ఆడటానికి సంకోచిస్తుండవచ్చని చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియా పర్యటన చివరలో సహజంగా ఉండాల్సిన అవసరం ఉందని సూచించామని చెప్పాడు. సూర్యకుమార్ ఫామ్, కెప్టెన్సీని కోచ్ ప్రశంసించాడు. సూర్య క్వాలిఈ గురించి ఎలాంటి సందేహం లేదని.. నెంబర్ త్రీ అయితే పరుగులు చేయడం ముఖ్యమని.. ఆ సమయంలో ఒత్తిడి ఉంటుందన్నారు. కొంతకాలంగా ఆశించిన స్థాయిలో ఆడలేదని.. కానీ, అదేం పెద్ద ఆందోళన కాదని చెప్పాడు.