Viral news : దేశానికి స్వాతంత్య్రం వచ్చి 80 ఏళ్లు కావస్తున్నా అంటరానితనం లాంటి అనాగరిక రుగ్మతలు ఇంకా పూర్తిగా రూపుమాయడం లేదు. ఇంకా చాలామంది దళితులను అంటరానివాళ్లుగా చూస్తున్నారు. తాజాగా తమిళనాడు రాష్ట్రం తంజావూరు తాలూకాలోని కొల్లంగరై గ్రామంలో అలాంటి ఘటనే చోటుచేసుకుంది.
స్కూల్ నుంచి ఇళ్లకు వెళ్తున్న దళిత విద్యార్థులను మార్గమధ్యలో ఓ వృద్ధ మహిళ అడ్డుకుంది. ‘మేం నడిచే బాటలో అంటరాని కులంలో పుట్టిన మీరు నడుస్తార్రా..?’ అంటూ కట్టెపట్టుకుని అడ్డం తిరిగింది. పిల్లలను వెనక్కి పంపేసింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను పిల్లల్లో ఒకరు వీడియో తీశారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
వృద్ధురాలి తీరుపై నెటిజన్లలో పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా స్కూల్ నుంచి ఇంటికి వెళ్లాలంటే దళితవాడకు చెందిన పిల్లలు చెరువు చుట్టూ తిరిగి ఒకటిన్నర కిలోమీటర్లు నడవాల్సి వస్తుంది. కానీ చెరువు ఇవతలివైపు దారిలో వెళ్తే అర్ధకిలోమీటర్ ప్రయాణంతో ఇళ్లకు చేరుకోవచ్చు. దాంతో బడి వదలగానే దళిత పిల్లలు దగ్గరిదారిలో వెళ్లేందుకు వచ్చారు. కానీ వృద్ధురాలు వారిని అడ్డుకుంది.
వీడియో వైరల్ కావడంతో దళితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. వృద్ధురాలిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని పోలీసులు తెలిపారు. అయితే వృద్ధురాలిని ఇంకా అదుపులోకి తీసుకోలేదని ఫిర్యాదుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.