KTR | రేవంత్ రెడ్డి సోదరులంతా భూముల దందాలో బిజీగా ఉన్నారని కేటీఆర్ విమర్శించారు. ఈ ఐదేళ్లు దోచుకోవడమే లక్ష్యంగా పగలు రాత్రి తేడా లేకుండా పనిచేస్తున్నారని అన్నారు. రూ. 1,50,000 కోట్లతో మూసీ సుందరీకరణ ప్రాజెక్టును మొదలుపెట్టిండని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 15 వేల కోట్లతో మూసి ప్రాజెక్టును పూర్తి చేయడానికి ప్రణాళికలు చేశామని.. దాన్ని పది రెట్లకు రేవంత్ రెడ్డి పెంచాడని అన్నారు.. వందేళ్ల కింద మూసీకి వరదలు వస్తే అప్పటి నిజాం ప్రభువు ఉస్మాన్ సాగర్, నిజాం సాగర్ చెరువులను కట్టిండని తెలిపారు.
వాతావరణ శాఖ హెచ్చరికలు రాగానే ఆ రెండు చెరువుల నీళ్లను ఖాళీ చేసి మూసి వరదలు అందులో పట్టి ఉంచాలని కేటీఆర్ అన్నారు. అప్పుడు హైదరాబాద్ కు వరద తగ్గుతుందని తెలిపారు. కానీ మూసీ ప్రాజెక్టు ఎలాగైనా చేయాలన్న దురుద్దేశంతో ఆ రెండు చెరువులను ఖాళీ చేయకుండా కావాలని ఇవాళ వరద వచ్చేలా చేశారని తెలిపారు. చరిత్రలో తొలిసారిగా ఎంజీబీఎస్ బస్టాండ్ కి వరద వచ్చిందని అన్నారు. ఇలా ఇంతకుముందు ఎప్పుడు కాలేదని గుర్తుచేశారు. రూ. 1,50,000 కోట్ల రూపాయలను దోచుకోవడానికి హైదరాబాద్ ప్రజలను వరదలో రేవంత్ రెడ్డి ముంచిండని ఆరోపించారు. మూసీ వద్దంటున్నారు కదా, నేను ఎలాగైనా చేస్తాను, పేదవాళ్లను ముంచైనా దాన్ని పూర్తి చేస్తానని చెప్పడానికే రేవంత్ రెడ్డి కిరాతకంగా వ్యవహరించాడని ఆరోపించారు.
1,50,000 కోట్ల రూపాయలను కొల్లగొట్టేందుకు..
పేదల ఇండ్లను ముంచిన కిరాతకుడు రేవంత్ రెడ్డి.– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS🔥 pic.twitter.com/869zuxQ9qu
— BRS Party (@BRSparty) September 27, 2025
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో 90 శాతం పని పూర్తి చేసింది కేసీఆర్ అని కేటీఆర్ అన్నారు. మొత్తం రిజర్వాయర్లను కట్టిండని.. నార్లాపూర్, వట్టెం, కరివేన, ఉద్దండపూర్ రిజర్వాయర్లను నిర్మించారని తెలిపారు. ఐదు రిజర్వాయర్లు, పంప్ హౌస్ లు కూడా పూర్తయ్యాయన్నారు. ఒక పంపును బీఆర్ఎస్ హయాంలోనే స్టార్ట్ చేశామని తెలిపారు. గోదావరి మీద కాళేశ్వరం ఎలాగైతే కట్టారో, కేసీఆర్ కృష్ణా మీద పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్లాన్ చేశారని తెలిపారు. నారాయణపేట, కొడంగల్‌కు కలిపి రెండు లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే అవకాశం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ఉందని అన్నారు. శ్రీశైలం లో నీళ్లు తీసుకొని కొల్లాపూర్ నుంచి కొడంగల్ కు వరకు తీసుకొచ్చే పథకం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకమని వివరించారు.
కేసీఆర్‌కు పేరు వస్తుందని 90 శాతం పనులు పూర్తయిన పాలమూరు రంగారెడ్డి పథకాన్ని పక్కనపెట్టి పేరు పెట్టిన రేవంత్ రెడ్డి ఆ మిగిలిన 10% పనులను పూర్తి చేయడం లేదని కేటీఆర్ ఆరోపించారు. జూరాల నుంచి కొడంగల్‌కు నీళ్లు తీసుకొస్తానని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును మొదలుపెట్టాడని అన్నారు. కానీ ఆల్మట్టి ఎత్తు పెంచితే జూరాలకు చుక్క నీళ్లు రావని హెచ్చరించారు. రూ. 4,500 కోట్లతో కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును మొదలుపెట్టిండని.. కమిషన్ల కోసం బాంబులేటి శ్రీనివాస్ రెడ్డికి, మెగా కృష్ణారెడ్డికి ఆ పనులను అప్పజెప్పిండని ఆరోపించారు. వెయ్యి కోట్ల రూపాయలను దోచుకోవడానికి ఇలా చేశారని అన్నారు.
రేవంత్ రెడ్డి దోపిడీని కోర్టు అర్థం చేసుకుంది కాబట్టే స్టే ఇచ్చిందని కేటీఆర్ అన్నారు. నిరుపేదల మీద, గిరిజనుల మీద, ముస్లింల మీద అసలు ఏ ఒక్కరి మీద కూడా రేవంత్ రెడ్డికి ప్రేమ లేదని విమర్శించారు. పేదల భూములు గుంజుకొని అల్లుడు కంపెనీ కోసం ప్రాజెక్టు పెట్టడం కోసం, అన్న తిరుపతి రెడ్డి కమిషన్ల కోసమే తప్ప.. కొడంగల్ నియోజకవర్గంలోని ప్రజల కోసం ఒక్క పని కూడా చేయడం లేదని అన్నారు. అన్నం పెట్టిన కొడంగల్ కు సున్నం పెట్టిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు. ఇలాంటి వ్యక్తులు కొడంగల్ కే కాదు మొత్తం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని విమర్శించారు. కొడంగల్‌లో నరేందర్ రెడ్డిని గెలిపిస్తే ప్రమోషన్ ఇస్తామని తెలిపారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యే యాత్ర కొడంగల్ నుంచే మొదలుపెట్టాలని అన్నారు.