దేవరకొండ రూరల్, జూలై 09 : తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని బీఆర్ఎస్వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షుడు బొడ్డుపల్లి కృష్ణ విమర్శించారు. గురువారం దేవరకొండ పట్టణంలో ఆయన మాట్లాడుతూ.. ఈ విద్యా సంవత్సరంలో కూడా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు అడ్మిషన్ల లక్ష్యాన్ని చేరుకోలేకపోయాయన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన 21.39 లక్షల అడ్మిషన్ల లక్ష్యానికి బదులుగా కేవలం 17.73 లక్షల మంది విద్యార్థులు మాత్రమే నమోదు కావడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే లక్షన్నర మందికి పైగా అడ్మిషన్లు తగ్గడం ప్రభుత్వ విద్యపై ప్రజల విశ్వాసం తగ్గిందనే విషయాన్ని స్పష్టం చేస్తోందన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యా ప్రమాణాలు, నాణ్యత క్షీణించాయని ఆరోపించారు.
గత 31 నెలల్లో ఫుడ్ పాయిజన్తో పాటు ఇతర ఘటనల్లో 133 మంది గురుకుల విద్యార్థులు మరణించడం అత్యంత విషాదకరమని, ఈ ఘటనలతో తమ పిల్లలను గురుకులాల్లో చేర్పించేందుకు తల్లిదండ్రులు భయపడుతున్నారన్నారు. ప్రభుత్వం బూట్లు, బెల్టులు, యూనిఫారాలు, ఎడ్యుకేషన్ కిట్లు అంటూ ప్రచారం చేసుకుంటున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఇప్పటికీ అనేక మంది విద్యార్థులకు అవి పూర్తిస్థాయిలో అందలేదని విమర్శించారు. ప్రచార ఆర్భాటం కంటే విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు సకాలంలో అందించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ఫాస్ట్ పథకాన్ని అమలు చేసినప్పటికీ అడ్మిషన్లు పెరగకపోవడం ఆందోళనకరమని, ప్రభుత్వ విద్యా సంస్థలపై ప్రజల్లో విశ్వాసం తగ్గి, ప్రైవేట్ పాఠశాలల వైపు తల్లిదండ్రులు మొగ్గు చూపుతున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు, విద్యార్థుల భద్రత, మౌలిక వసతులు, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించాలని బొడ్డుపల్లి కృష్ణ డిమాండ్ చేశారు.