ముంబై : తమిళనాడు సీఎం విజయ్ నటించిన చిత్రం జన నాయకన్(Jana Nayagan)పై కొత్త అప్డేట్ వచ్చింది. ఆ ఫిల్మ్‌కు సెన్సార్ బోర్డు క్లియరెన్స్ ఇచ్చింది. జన నాయకన్ సినిమాకు సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ గురువారం ఈ విషయాన్ని వెల్లడించింది. సీబీఎఫ్సీ అధికారిక వెబ్సైట్లో జన నాయకన్ సినిమాకు చెందిన సర్టిఫికేట్ అందుబాటులో ఉన్నది. 183 నిమిషాల(3 గంటల 3 నిమిషాలు) నిడివితో ఉన్న ఈ సినిమాకు సర్టిఫికేట్ జారీ చేసినట్లు సీబీఎఫ్సీ చెప్పింది. అయితే ఈ సినిమా సెన్సార్ కోసం జరిగిన కట్స్ గురించి మాత్రం వెబ్సైట్లో పెట్టలేదు. వాస్తవానికి ఈ ఫిల్మ్ పొంగల్ పండుగ సందర్భంగా జనవరి 9వ తేదీన రిలీజ్ కావాల్సి ఉంది. కానీ సెన్సార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో ఫిల్మ్ రిలీజ్ నిలిచిపోయింది. 2025 డిసెంబర్లో ఈ సినిమా సర్టిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. సీన్ కట్ చేస్తే.. ప్రస్తుతం తమిళనాడు సీఎంగా విజయ్ బాధ్యతలు స్వీకరించారు.
తాజా సమాచారం ప్రకారం ‘జన నాయకన్’ ప్రపంచవ్యాప్తంగా జూలై 24, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది. విదేశీ డిస్ట్రిబ్యూటర్లకు కూడా ఇదే రిలీజ్ డేట్‌ను అధికారికంగా తెలియజేసినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. త్వరలోనే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సినిమా విజయ్ సినీ కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాల్లో ఒకటిగా నిలవనుంది. నటుడిగా ఆయన చివరి చిత్రం కావడం వల్ల అభిమానుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రాజకీయ, యాక్షన్ అంశాలతో రూపొందిన ఈ చిత్రం విజయ్‌కు గ్రాండ్ ఫేర్వెల్ మూవీగా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.
హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. యువ నటి మమితా బైజు కూడా కీలక పాత్రలో కనిపించనుండగా, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, దర్శకుడు-నటుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్, సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్, ప్రియమణి, నరైన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమా కథపై ఇప్పటికే భారీ ఆసక్తి నెలకొంది. ఈ చిత్రాన్ని KVN ప్రొడక్షన్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. విజయ్-అనిరుధ్ కాంబినేషన్లో వచ్చిన గత చిత్రాల పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించిన నేపథ్యంలో, ‘జన నాయకన్’ సంగీతంపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.