New Zealand PM : భారత ప్రధాని (Prime Minister of India) నరేంద్ర మోదీ (PM Modi) న్యూజిలాండ్ (New Zealand) పర్యటనకు వెళ్లడానికి ముందే ఆ దేశ ప్రధాని క్రిస్టఫర్ లుక్సాన్ (Christopher Luxon) కీలక ప్రకటన చేశారు. భారత్‌కు న్యూజిలాండ్ ఎగుమతి చేస్తున్న వస్తువుల్లో 57 శాతం ఉత్పత్తులపై ఇకపై ఎలాంటి సుంకాలు ఉండబోవని చెప్పారు. ఇరుదేశాల మధ్య వాణిజ్య ఒప్పందం (Trade deal) కుదిరిన తొలిరోజు నుంచే ఇది అమల్లోకి వస్తుందన్నారు.
ఈ చారిత్రక ఒప్పందం ద్వారా భారత మార్కెట్లో న్యూజిలాండ్ ఉత్పత్తులకు విస్త్రృత ప్రవేశం లభిస్తుందని, ఇది న్యూజిలాండ్ వ్యాపారాలకు ఊతమిస్తుందని లుక్సాన్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో ఒక పోస్టు చేశారు. మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న ప్రధాని మోదీ.. జూలై 10, 11 తేదీల్లో న్యూజిలాండ్‌లో పర్యటించనున్నారు. దాదాపు గత 40 ఏళ్లలో భారత ప్రధాని అక్కడ పర్యటించడం ఇదే తొలిసారి. పర్యటనలో భాగంగా ఆక్లాండ్‌లో ఏర్పాటు చేయనున్న సమావేశంలో వాణిజ్య ఒప్పందాలు, అభివృద్ధి తదితర అంశాలపై ఇరుదేశాల నేతలు చర్చించనున్నారు.
ప్రభుత్వ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. వాణిజ్యం, రక్షణ, పరస్పర సహకారం తదితర అంశాలపై ప్రధాని మోదీ దృష్టిపెట్టనున్నారు. అంతేకాకుండా అక్కడి వ్యాపారవేత్తలు, క్రీడాకారులతోనూ మోదీ సమావేశం కానున్నారు. న్యూజిలాండ్‌లోని ఎన్నారైలతో సమావేశం ఏర్పాటు చేసి ప్రసంగించనున్నారు.