మెదక్, జూలై 31(నమస్తే తెలంగాణ) : మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మెదక్ మండలంలోని రాయన్‌పల్లి ప్రాజెక్టు కట్టకు గండిపడింది. సాగునీటి కాల్వ దెబ్బతిని నీరంతా వృథాగా పోతున్నది. గతేడాది భారీగా కురిసిన వానలకు వరద పోటెత్తి రాయన్‌పల్లి ప్రాజెక్టు కట్ట దెబ్బతిన్నది. మరమ్మతులు చేయాలని పలుసార్లు మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి మెదక్ కలెక్టర్, నీటిపారుదలశాఖ అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోలేదు.
మరమ్మతులు చేయకపోతే వర్షాకాలంలో ప్రమాదం తప్పదని ‘నమస్తే తెలంగాణ’ ముందుగానే హెచ్చరించినా, అధికారులు పట్టించుకోలేదు. ప్రాజెక్టు మరమ్మతుల కోసం నీటిపారుదల శాఖ ఇంజినీరింగ్ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా నిధులు మంజూరు చేయలేదు. దీంతో గండిపడింది. శుక్రవారం పద్మాదేవేందర్‌రెడ్డి రాయన్‌పల్లి ప్రాజెక్టును పరిశీలించి, స్థానిక రైతులతో మాట్లాడారు.
రాయన్‌పల్లి ప్రాజెక్టుకు మరమ్మతులు చేయాలని కలెక్టర్, నీటిపారుదల శాఖ అధికారులు, ప్రభు త్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని పద్మాదేవేందర్‌రెడ్డి విమర్శించారు. మూడు రోజులుగా కురిసిన వర్షాలకు రాయన్‌పల్లి ప్రాజెక్టు డిస్ట్రిబ్యూషన్ కెనాల్ కూలిపోగా, చెరువు కట్ట సగానికి పైగా దెబ్బతినడంతో ఏడు గ్రామాల ప్రజలు, రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. గత ఏడాది భారీ వర్షాలు కురిసి వరదతో కాల్వలు, కట్ట దెబ్బతిన్నా మరమ్మతులు చేయలేదన్నారు.
తాత్కాలిక మరమ్మతులు చేసి చేతులు దులుపుకోవడంతో ప్రాజెక్టు డిస్ట్రిబ్యూషన్ కెనాల్ పూర్తిగా దెబ్బతిన్నదన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో గండిపడిందని, రైతుల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటం ఆడడం తగదని మండిపడ్డారు. ప్రాజెక్టు డిస్ట్రిబ్యూషన్ కెనాల్ ద్వారా 2700 ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు ఏడు గ్రామాలకు ప్రత్యక్షంగా, మరో పది గ్రామాలకు పరోక్షంగా నీటి సరఫరా జరుగుతుందన్నారు. సాగునీటి కాల్వ కూలిపోవడంతో పంటలకు నీరు అందే పరిస్థితి లేదన్నారు. మూడు నెలల క్రితమే ప్రాజెక్టుకు మరమ్మతులు చేయాలని రైతులతో కలిసి మెదక్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశామని గుర్తుచేశారు.
కామారెడ్డి జిల్లా దంతెపల్లి వైపు నుంచి వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉందన్నారు. బీఆర్ఎస్ మెదక్ మండల అధ్యక్షుడు అం జగౌడ్, మాజీ ఎంపీపీ కిష్టయ్య, మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, ఏఎంసీ మాజీ చైర్మన్ గంగా నరేందర్, రాయన్‌పల్లి మాజీ సర్పంచ్ నాగులు, బీఆర్ఎస్ అధ్యక్షుడు వీరస్వామి, మెదక్ మున్సిపాల్ కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు, బీఆర్ఎస్ నాయకుడు జీవన్‌రావు, ఆంజనేయులు, బాలయ్య, నర్సాగౌడ్, నర్సింహులు, దుర్గయ్య, కిష్టయ్య, సిద్ధిరాములు, శ్రీను, భాస్కర్, యాదగిరి, శ్రీధర్ పాల్గొన్నారు.