తిరువనంతపురం: ఉజ్బెకిస్థాన్‌లో మెడిసిన్ చదువుతున్న కేరళకు చెందిన విద్యార్థినిని క్లాస్మేట్ వేధించాడు. ల్యాప్‌టాప్‌తో తలపై కొట్టడంతో ఆమె మరణించింది. విద్యార్థిని కుటుంబం పలు అనుమానాలు వ్యక్తం చేసింది. నిందితుడ్ని కేరళకు రప్పించాలని, ఈ కేసుపై విచారణ ఇక్కడే జరుపాలని డిమాండ్ చేసింది. (Kerala medical student killed) అలప్పుజా జిల్లా హరిపాడ్‌కు చెందిన 22 ఏళ్ల సావారియా బసంత్, మలప్పురానికి చెందిన 23 ఏళ్ల సదరుల్ అనామ్ కలిసి ఉజ్బెకిస్థాన్‌లోని బుఖారా స్టేట్ మెడికల్ ఇన్స్టిట్యూట్లో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. జూలై 3న వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఆగ్రహించిన అనామ్ తన ల్యాప్‌టాప్‌తో సావారియా తలపై కొట్టాడు. ఆమె మరణించడంతో ఉజ్బెకిస్థాన్ పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు.
కాగా, ఈ సమాచారం తెలుసుకున్న విద్యార్థిని కుటుంబ సభ్యులు ఉజ్జెకిస్థాన్ వెళ్లారు. ఆమె మృతదేహాన్ని కేరళకు తీసుకువచ్చారు. సావారియా కుటుంబం ఫిర్యాదుతో కేరళ పోలీసులు అనామ్పై బుధవారం హత్య కేసు నమోదు చేశారు. అలప్పుజ మెడికల్ కాలేజీలో ఆమె మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించారు.
మరోవైపు విద్యార్థిని శరీరం అంతటా తీవ్ర గాయాలు ఉన్నాయని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. సావారియాను చిత్రహింసలకు గురిచేసి, దారుణంగా కొట్టి చంపినట్లు అనుమానం వ్యక్తం చేశారు. విద్యార్థినిని మతం మారాలని నిందితుడు బలవంతం చేయడాన్ని చాలా మంది విద్యార్థులు చూసినట్లు ఉజ్జెకిస్థాన్ దర్యాప్తు అధికారులు తమకు చెప్పారన్నారు. అందుకే ఇక్కడ పోస్ట్‌మార్టం నిర్వహించడంతో పాటు కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసినట్లు వివరించారు. నిందితుడ్ని కేరళకు రప్పించి ఈ కేసుపై విచారణ జరుపాలని పోలీస్ అధికారిని కోరినట్లు వెల్లడించారు.
అయితే ఉజ్బెకిస్థాన్‌లో ఈ కేసుపై జరుగుతున్న దర్యాప్తు వివరాలను భారత రాయబార కార్యాలయం, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా సేకరిస్తామని పోలీస్ అధికారి తెలిపారు. ఒకవేళ నిందితుడిపై అక్కడ విచారణ జరిగి చర్యలు తీసుకుంటే, కేరళలో నమోదు చేసిన కేసును మూసివేస్తామని చెప్పారు. ఆ దేశంలో ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే, ఈ కేసు దర్యాప్తును ఇక్కడ కొనసాగించే అంశాన్ని పరిశీలిస్తామని పోలీస్ అధికారి వివరించారు.