ఆదిలాబాద్, అక్టోబర్ 12(నమస్తే తెలంగాణ) : బ్యాంకు, ఈడీ ఆధీనంలో ఉన్న విలువైన భూమిని, అధికారులతో కుమ్మక్కై నకిలీ పత్రాలు సృష్టించి సప్లమెంటరీ సెత్వార్ల ద్వారా కోట్ల రూపాయల భూమిని కాజేయడానికి ప్రయత్నించిన భూ మాఫియా ముఠాపై కేసు నమోదు చేసినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్‌రెడ్డి తెలిపారు. ఈ కేసులో పది మందిపై కేసు నమోదు చేశామని రమేశ్ శర్మ(ఏ1) రియల్ ఎస్టేట్ వ్యాపారి, ఇబ్రహీం మహమ్మద్ (ఏ2) రియల్ ఎస్టేట్ వ్యాపారి, యతేంద్రనాథ్(ఏ3), హితేంద్రనాథ్(ఏ4), రాకేశ్ శర్మ(ఏ5), మనోజ్‌కుమార్ అగర్వాల్(ఏ6), పూనం వ్యాస్(ఏ7), అనుపమ వ్యాస్(ఏ8), శివాజీ(ఏ9), సర్వేయర్ ఉన్నారని తెలిపారు.
మనోజ్ కుమార్ సర్వే నంబరు 65 బై బీ, 65 బై 4 లోని 2.09 ఎకరాల భూమిని జీఎస్ అయిల్ మిల్ పేరిట ఎస్పీఐ బ్యాంకులో తనాఖా పెట్టి రుణం తీసుకున్నాడని పేర్కొన్నారు. 2012లో మనోజ్ అగర్వాల్ 65బై4బై1పేరిట 2.10 ఎకరాల భూమిని నలుగురికి విక్రయించారు. ఈ భూమిని విక్రయదారుడు డబుల్ రిజిస్ట్రేషన్ చేయించి జీపీఏ ద్వారా 2013లో పూనం వ్యాస్‌కు, 2014లో పూనం వ్యాస్ సెల్డిడ్ ద్వారా 2014లో అనుపమ వ్యాస్‌కు విక్రయించారు. 2023లో రమేశ్ శర్మ తన అనుచరులతో భూ మాఫియాతో కుమ్మక్కై భూమిని తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. సర్వే అధికారుల ద్వారా సెత్వార్ తీసుకొని గతేడాది నవంబరు 18న నిందితులు టిప్పర్లతో చదును చేసి భూమిలో ప్రైవేశించి స్వాధీనం చేసుకున్నారు.
2022 ఆర్థిక నేరాల కారణంగా మనోజ్ కుమార్ తనాఖా పెట్టిన భూమిని ఈడీ స్వాధీనం చేసుకోగా.. పోలీసులు రక్షణగా ఉన్నారు. పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నించగా వారిని బెదిరింపులకు గురి చేశారు. భూమి స్వాధీనంలో ఉన్న అధికారి ఫిర్యాదు మేరకు కలెక్టర్ విచారణ జరిపి రమేశ్ శర్మ రిజిస్ట్రేషన్, సప్లమెంటరీ రిజిస్ట్రేషన్ రద్దు చేయగా, కలెక్టర్ ఆదేశాలతో జత చేస్తూ ఫిర్యాదుదారుడు ఆదిలాబాద్ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కేసులో సప్లమెంటరీ సెత్వార్ ఇచ్చి భూ మాఫియాకు సహకరించిన ఇతర అధికారుల పాత్రపై దర్యాప్తు జరుగుతుందన్నారు.