జనగామ, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ) : పరామర్శకు వచ్చి రాజకీయాలు మాట్లాడడం కాంగ్రెస్ నాయకులకే చెల్లిందని స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య ధ్వజమెత్తారు. సాగునీటి ప్రాజెక్టులపై మంత్రులు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆదివారం ‘నమస్తే తెలంగాణ’తో రాజయ్య మాట్లాడుతూ కేసీఆర్‌పై పగతో కాళేశ్వరం ప్రాజెక్టును కూలేశ్వరం అంటూ కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేస్తున్నారన్నారు. రైతులకు మేలు చేసే ప్రాజెక్టుకు ఇప్పటికైనా మరమ్మతు చేపట్టాలని డిమాండ్ చేశారు. రైతులకు సాగు నీరు కోసం 22 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఒక ప్రాజెక్ట్ కట్టలేదని, 90 శాతం పూర్తయిన దేవాదులకు ఒక్క పైసా ఖర్చు చేయలేదన్నారు.
స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాత్రం రూ.1,001 కోట్లకు క్యాబినెట్ ఆమోదించిందని చెబుతున్నా తట్టెడు మట్టి తీయలేదని, పైసా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇద్దరు మహిళా మంత్రులున్నా ఏరోజు దేవాదులపై మాట్లాడింది లేదన్నారు. నష్కల్-ఉప్పుగల్లు కెనాల్ కోసం రూ. 1,015 కోట్లకు పెంచి పైసా ఇవ్వలేదని, పనులు మొదలు కాలేదన్నారు. 11 రకాల కేంద్ర అనుమతులు, సాంకేతిక నిపుణుల సూచనలు, అప్పటి క్యాబినేట్ ఆమోదంతో నిర్మించిన మేడిగడ్డ బరాజ్‌లో రెండేళ్ల కిందట రెండు పిల్లర్లు కుంగితే ఇప్పటి వరకు మరమ్మతు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆరునూరైనా తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్ట్‌ను కట్టితీరుతామని ఉత్తమ్‌కుమార్ ఉట్టి మాటలు మాట్లాడుతున్నాడని, అకడ నీటి లభ్యత లేదని, మహారాష్ట్ర, సీయూసీ, ఫారెస్ట్ అనుమతులు లేవని, అయినా కడుతారట అంటూ ఎద్దేవా చేశారు. ప్రాజెక్టులు ప్రజల కోసం కాకుండా కమీషన్ల కోసం రూపకల్పన చేయాలని మాత్రమే కాంగ్రెస్ ఆలోచిస్తున్నదని, దేవాదుల ప్రాజెక్టు పనులు 90 శాతం వరకు కేసీఆర్ హయాంలోనే పూర్తయ్యాయన్నారు. రైతు సంక్షేమం, సాగు నీటి హకు కోసం కేసీఆర్ చేసిన పోరాటాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కొత్త ప్రాజెక్టులు దేవుడెరుగు కనీసం మోటర్ల రిపేర్లు, ప్రాజెక్టుల మరమ్మతులను ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చేపట్టాలని రాజయ్య డిమాండ్ చేశారు.