Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల పలు దేశాలపై సుంకాలు విధించి దారికి తెచ్చుకునే ప్రయత్నం చేశారు. కానీ ఆ ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ట్రంప్ సుంకాల కారణంగా అమెరికాలో పలు వస్తువుల ధరలు పెరిగిపోయాయి. వినియోగదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడంతో ఒత్తిడికి తలొగ్గిన ట్రంప్.. ఆహార ఉత్పత్తులపై సుంకాలను తొలగించారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు.
ఇటీవల ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగలడం కూడా ట్రంప్ దిగి రావడానికి ఒక కారణంగా చెప్పవచ్చు. ఎట్టకేలకు దిగొచ్చిన ట్రంప్. గొడ్డు మాంసం, కాఫీ, అరటి పండ్లు, నారింజ, పండ్ల రసం లాంటి పలు ఆహార ఉత్పత్తులపై సుంకాలను తొలగించారు. పలు దేశాలపై భారీగా సుంకాలు విధించినప్పటికీ ఆ ప్రభావం వినియోగదారులపై పడదని ఇంతకాలం ట్రంప్ చెబుతూ వచ్చారు. కానీ గొడ్డు మాంసం ధరలు రికార్డు స్థాయికి చేరుకోవడంతో వినియోగదారుల్లో ఆందోళన మొదలైంది. ఎన్నికల్లో తమ ప్రతాపం చూపించారు.
అమెరికాకు బ్రెజిల్ నుంచి భారీగా గొడ్డు మాంసం ఎగుమతి అవుతుంది. బ్రెజిల్‌పై కూడా ట్రంప్ భారీ సుంకాలు విధించారు. దాంతో గొడ్డు మాంసం ధర భారీగా పెరిగిపోయింది. వినియోగదారుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో ట్రంప్ దిగొచ్చారు. గొడ్డు మాంసంతోపాటు పలు ఆహార ఉత్పత్తులు, ఎరువులపై సుంకాలను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.