KTR | హైదరాబాద్ : పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణకు పూర్వవైభవం తీసుకొచ్చామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. బన్సీలాల్‌పేట్‌లోని మెట్లబావిని పునర్వినియోగంలోకి తీసుకొచ్చాం. గతంలో చెత్తా చెదారంతో మెట్లబావి కూరుకుపోయి ఉండే. 17వ శతాబ్దం నాటి మెట్ల బావికి కేసీఆర్ సర్కార్ మెరుగులు అద్దింది. ప్రస్తుతం పర్యాటకులతో మెట్ల బావి సందడిగా మారింది. బన్సీలాల్‌పేట మెట్ల బావి అందమైన సాంస్కృతిక కేంద్రంగా మారడం ఆనందంగా ఉంది అని కేటీఆర్ పేర్కొన్నారు.
చెత్తాచెదారంతో పూడుకుపోయిన ఈ బావి పునరుద్ధరణ పనులను 2021 ఆగస్టు 15న ప్రారంభించారు. సుమారు 500 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను తొలగించారు. కండ్లు చెదిరేలా పర్యాటక హంగులు కల్పించారు. విద్యుద్దీపాలు అలంకరించి.. ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు వీలుగా అంపీ థియేటర్, పూడికతీత తొలగింపు సందర్భంగా లభ్యమైన వివిధ రకాల పరికరాల ప్రదర్శన కోసం గ్యాలరీ, చక్కటి పచ్చదనంతో కూడిన గార్డెన్‌ను ఏర్పాటు చేశారు.
సికింద్రాబాద్ ప్రజల తాగునీటి కోసం బన్సీలాల్‌పేటలోని మెట్ల బావిని అసఫ్-జాహీ వంశస్తులు ఆరు అంతస్తుల లోతు, మెట్లు, స్తంభాలతో అద్భుతంగా నిర్మాణం చేశారు. ఊటనీరుతో నిండి మోట ద్వారా నీటిని పైకి లాగడానికి ఏర్పాట్లు కూడా ఉండేవి. ఆంగ్లేయుల కాలంలో సికింద్రాబాద్ పాలనాధికారి, రెసిడెంట్ అధ్యక్షుడు టీహెచ్ కీస్ ఈ బావిని 1933లో పునరుద్ధరించారు. అందుకు సేట్ బన్సీలాల్ అనే వ్యాపారి ఆర్థిక సహకారం అందించారని, అనంతరమే ఆ ప్రాంతానికి బన్సీలాల్‌పేట్ అని నిలిచిపోయింది.
నిజాం రాజులు తాగునీటి కోసం కట్టించిన బన్సీలాల్‌పేట మెట్ల బావి రాష్ట్ర ప్రభుత్వం, రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ చొరవతో పునర్జీవం పోసుకున్నది. ఈ బావి సామర్థ్యం 22లక్షల లీటర్లు. నీళ్లు ఎంత కిందికి వెళ్లినా.. మెట్ల ద్వారా కిందకు దిగి.. కుండ లేదా బిందెతో మంచి నీళ్లు తోడుకోవచ్చు. అయితే కాలక్రమేణా చెత్తా చెదారం నిండిపోయింది. ఈ బావి పునరుద్ధరణ పనులను 2021 ఆగస్టులో ప్రారంభించారు. దాదాపు 5 వందల మెట్రిక్ టన్నుల మట్టి, చెత్తను తొలగించారు. మట్టి తీస్తున్న కొద్దీ పురాతన వస్తువులు బయట పడ్డాయి. ఉపరితలం నుంచి 50 ఫీట్ల లోతు వరకు ఉన్న బావి లోపలి నుంచే ఓ నిరంతర నీటి ఊట ఉంది. ఇది 55 ఫీట్ల కింద నుంచే వస్తున్నట్టు గుర్తించారు.
What a mellifluous way to spend an evening !!
Delighted to see the Bansilalpet Stepwell turn into a lovely cultural hotspot ❤️
Well done @tangysessions https://t.co/kHejDWgjBu pic.twitter.com/8jJ2AFliBF
— KTR (@KTRBRS) November 16, 2025