వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బీబీసీని తీవ్రంగా హెచ్చరించారు. తన ప్రసంగాన్ని వక్రీకరించినందుకు 5 బిలియన్ డాలర్లు (సుమారు రూ.44 వేల కోట్లు) పరిహారం చెల్లించాలని దావా వేస్తానని చెప్పారు. వివరాల్లోకి వెళితే, 2020లో జరిగిన దేశాధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత 2021 జనవరి 6న వాషింగ్టన్‌లోని కేపిటల్ హిల్‌పై ఆయన మద్దతుదారులు దాడి చేశారు. ఆ సందర్భంగా ట్రంప్ దాదాపు గంటసేపు ప్రసంగించారు. దీనిపై బీబీసీ ప్రసారం చేసిన డాక్యుమెంటరీలో తన ప్రసంగాన్ని వక్రీకరించారని ట్రంప్ ఆరోపిస్తున్నారు. ట్రంప్ రాజకీయంగా బీబీసీపై ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో బీబీసీ డైరెక్టర్ జనరల్ టిమ్ డేవీ, న్యూస్ చీఫ్ టర్నెస్ డెబోరా రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ విషయమై బీబీసీ ట్రంప్‌కు క్షమాపణ చెప్పినా ట్రంప్ శాంతించలేదు. ట్రంప్‌కు 1 బిలియన్ డాలర్లు పరిహారం చెల్లించాలని ట్రంప్ తరపు న్యాయ బృందం బీబీసీకి లేఖ రాసింది.