సిద్దిపేట, ఫిబ్రవరి 12(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. శుక్రవారం(నేటి) ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభించి ఫలితాలు ప్రకటిస్తారు.ప్రతి వెయ్యి ఓటర్లకు ఒక రౌండ్ ఉండేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. వార్డుల వారీగా కౌంటింగ్ చేపడుతారు. మధ్యాహ్నం వరకు ఫలితాలు వెలువడనున్నాయి. పూర్తిస్థాయి ఫలితాలు సాయంత్రం వరకు వెలువడే అవకాశాలు ఉన్నాయి. ముందుగా పోస్టల్ బ్యాలెట్‌ను లెక్కిస్తారు. అనంతరం వార్డుల వారీగా కౌంటింగ్ చేపడుతారు.
19 మున్సిపాలిటీలు…
సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో 19 మున్సిపాలిటీల్లో 402 వార్డులకు ఎన్నికలు జరిగాయి. 1658 మంది అభ్యర్థుల భవితవ్యం నేడు తేలనున్నది. బల్దియాల్లో కౌంటింగ్‌కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సిద్దిపేట జిల్లాలో 82,921 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా, 82.03 శాతం పోలింగ్ నమోదైంది. మెదక్ జిల్లాలో 69,823 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా, 81.09 శాతం, సంగారెడ్డి జిల్లాలో 2,59,821 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా, 76.01 శాతం పోలింగ్ నమోదైంది.
కౌంటింగ్ అనంతరం విజేతలకు గెలుపు ధ్రువపత్రాలు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు అందజేస్తారు. ఈనెల 14న మున్సిపాలిటీల చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికల కోసం ప్రత్యేక సమావేశానికి నోటిఫికేషన్ జారీచేసి, 16న ఉదయం 11 గంటలకు నూతన కౌన్సిలర్ల చేత ప్రమాణ స్వీకారం చేస్తారు. మధ్యాహ్నం 12.30 గంటలకు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను నిర్వహిస్తారు. ఏదైనా కారణాల చేత ఆరోజు కానీ పక్షంలో 17న నిర్వహించనున్నారు.

