KTR | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని పత్తి రైతులు తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకోవడానికి దిక్కులేని పరిస్థితి నెలకొనడంపై కేటీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని రైతుల కష్టాలను తీర్చాలని డిమాండ్ చేశారు. ఈ సంక్షోభానికి ప్రధాన కారణం కేంద్రంలోని బీజేపీ మరియు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాల ఉమ్మడి నిర్లక్ష్యమేనని మండిపడ్డారు.
ఈ రెండు ప్రభుత్వాల నిర్లక్ష్యం పత్తి రైతులకు శాపంగా మారిందని ఆయన పేర్కొన్నారు. దాదాపు 50 లక్షల ఎకరాల పత్తి పంట పండించిన రైతన్నలు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉంటే కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రభుత్వాలు మొద్దు నిద్రలో ఉన్నాయని మండిపడ్డారు. ఇప్పటికైనా రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు ఎంపీలు ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వంపైన ఒత్తిడి తీసుకురావాలన్నారు. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా చొరవ చూపించి కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో చర్చించి రాష్ట్ర రైతన్నల సమస్యలను తీర్చాలని డిమాండ్ చేశారు. అడ్డగోలు నిబంధనలతో, కుంటి సాకులతో కొనుగోలు ఆపివేసిన సీసీఐ వైఖరిని కేటీఆర్ తీవ్రంగా ఎండగట్టారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి వలన రైతన్నకు కనీస మద్దతు ధర కూడా దొరకడం లేదని, తీవ్రమైన వర్షాల వలన ఇప్పటికే పంట నష్టం వలన ఇబ్బందులు పడుతున్న రైతన్నలు మిగిలిన పంటను కూడా అమ్ముకోలేక నష్టాల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని దాదాపు 50 లక్షల ఎకరాల్లో పత్తి పండిస్తున్న రైతన్నలను పట్టించుకోకుండా బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఎండగట్టారు. పత్తి కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని తీవ్రంగా మండిపడ్డారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 60 సార్లు ఢిల్లీకి వెళ్లినా, రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ మరియు కాంగ్రెస్ ఎంపీలు ఎవరూ కూడా తెలంగాణ పత్తి రైతుల సమస్యను కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు అండగా నిలబడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు. రాష్ట్రంలోని లక్షల మంది రైతన్నలు తమ పత్తిని కొనుగోలు చేసే దిక్కులేక ఆందోళన చేస్తున్న రేవంత్ రెడ్డి ఇప్పటివరకు కనీసం స్పందించకపోవడం శోచనీయమని అన్నారు. ప్రస్తుతం పత్తికి క్వింటాల్‌కు రూ. 8,110 కనీస మద్దతు ధర (MSP) ఉన్నప్పటికీ, బహిరంగ మార్కెట్లో రైతులు కేవలం రూ. 6,000 నుండి రూ. 7,000 రూపాయలు మాత్రమే రైతులకు దక్కడం అత్యంత కష్టంగా మారిందన్నారు. దీనివల్ల ప్రతి క్వింటాల్‌పై రైతులు దాదాపు రూ. 2,000 వరకు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో కురిసిన ఎడతెగని వర్షాల కారణంగా పత్తి తడిసిపోయి, తేమ శాతం పెరిగి రైతన్నలు ఇబ్బందులు పడుతున్నారని, మరోవైపు ఇదే సాకును చూపించి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తేమ ఎక్కువగా ఉన్న పత్తి కొనుగోలును చేయకుండా కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. రైతుల విజ్ఞప్తులను ఏమాత్రం పట్టించుకోకపోవడం రైతుల పట్ల ప్రభుత్వాలకు ఉన్న ఉదాసీనతకు నిదర్శనం అన్నారు.
పత్తి కొనుగోళ్ల విషయంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఉద్దేశపూర్వకంగా కొర్రీలు పెడుతోందని ఆరోపించారు. గతంలో ఎకరాకు 12 క్వింటాళ్ల వరకు కొనుగోలు పరిమితి ఉండగా, దాన్ని ఏకంగా 7 క్వింటాళ్లకు తగ్గించడం రైతులకు మరింత ఇబ్బందిగా మారిందన్నారు. జిన్నింగ్ మిల్లుల అవినీతి అంటూ కుంటి సాకులు చెబుతూ కేవలం ఏడు క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తే, మిగిలిన పంటను రైతులు ఎక్కడ అమ్ముకోవాలని ఆయన ప్రశ్నించారు. మరోవైపు జిన్నింగ్ మిల్లుల పైన కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరి వలన జిన్నింగ్ మిల్లులు ఒకేసారి ప్రారంభం కాకపోవడం కూడా రైతుల విక్రయాలకు ఆటంకంగా మారిందన్నారు.
ఇప్పటికీ పలు జిల్లాల్లో పత్తి కొనుగోలు ఆగిపోయింది అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జిన్నింగ్ మిల్లుల కేటగిరీల విభజనను నిరసిస్తూ మరోవైపు రేపటి నుంచి జిన్నింగ్ మిల్లులు మరోసారి బందుకు పిలుపునిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. నెల రోజుల్లో సీసీఐ కేవలం 1.12 లక్షల టన్నుల పత్తిని మాత్రమే కొనుగోలు చేసిందని, ఈ సీజన్లో అంచనా వేసిన 28.29 లక్షల టన్నుల ఉత్పత్తితో పోలిస్తే ఇది అత్యంత స్వల్పమని ఎత్తి చూపారు. కేవలం రాజకీయాలపైనే దృష్టి సారించకుండా, రాష్ట్రంలో నెలకొన్న పత్తి కొనుగోళ్ల సంక్షోభంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మొత్తం 325 జిన్నింగ్ మిల్లులకు గాను 256 మిల్లులు మాత్రమే ఓపెన్ చేసి, మిగిలిన వాటిని కూడా తెరవకుండా రైతులను ఇబ్బందులకు గురిచేయడం ప్రభుత్వాల ఉద్దేశపూర్వక నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆయన విమర్శించారు. మరోవైపు రైతులు తమ పత్తిని అమ్ముకునేందుకు కపస్ మొబైల్ యాప్ ఖచ్చితంగా వినియోగించాలన్న నిబంధన సడలించాలని, రైతులు పత్తి ఎప్పుడు తీసుకువస్తే అప్పుడు కొనుగోలు చేసే అవకాశం ఇవ్వాలి అన్నారు. రాష్ట్రంలోని పత్తి రైతన్నల సమస్యలను దృష్టిలో ఉంచుకొని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీకి ఒక ప్రతినిధి బృందాన్ని పంపించి కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. గతంలో ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం మొండికి వేసినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో పాటు మంత్రుల బృందం ఈ అంశంలో ప్రత్యేకంగా చొరవ చూపిన విషయాన్ని గుర్తు చేశారు. వెంటనే కేంద్రంపైన ఒత్తిడి తీసుకువచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రకటించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.