తుంగతుర్తి, ఫిబ్రవరి 24 : రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తుంగతుర్తి ఎస్ఐ క్రాంతి కుమార్ అన్నారు. రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం అరైవ్ అలైవ్ లో భాగంగా మంగళవారం మండల కేంద్రంలోని జడ్.పి.హెచ్.ఎస్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలను, ప్రమాద మరణాలను నివారించడం కోసం ముందస్తు జాగ్రత్తలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. విద్యార్థులు రోడ్డు భద్రత పట్ల, ప్రమాదాల నివారణ పట్ల చుట్టుపక్కల వారిని, తల్లిదండ్రులను చైతన్యవంతం చేయాలని కోరారు. ప్రయాణ సమయంలో హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పక ధరించాలని సూచించారు. వాహనాలకు అన్ని రకాల అనుమతి పత్రాలు కలిగి ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గుజ్జ భాస్కర్, సహదేవ్, కానిస్టేబుల్ విజయ్ పాల్గొన్నారు.