సిటీబ్యూరో, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): జుబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీకి ప్రజల నుంచి వస్తున్న ఆదరణతో కాంగ్రెస్ పార్టీ దిమ్మ తిరిగి పోతుంది. సోమవారం రహ్మత్‌నగర్‌లో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశానికి అనూహ్య స్పందన రావడంతో కాంగ్రెస్ పార్టీకి గుబులు మొదలయ్యింది. బీఆర్ఎస్ పార్టీ అభిమానులు, మాగంటి గోపీనాథ్ నియోజకవర్గాన్ని ఒక కుటుంబంగా భావించి ప్రతి ఒక్కరి గుండెల్లో ఉండటంతో వేలాది మంది ప్రజలు హాజరవ్వడంతో అది బహిరంగ సభగా మారింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి తరలివచ్చిన కార్యకర్తలు, నాయకులతో ఎస్పీఆర్ గ్రౌండ్ కిక్కిరిసిపోవడంతో ఆ ప్రాంతమంతా గులాబీమయంగా మారింది. తమ అభిమాన నాయకుడి కుటుంబానికి అండగా ఉంటామంటూ నియోజకవర్గంలోని ప్రతి బస్తీ, కాలనీల నుంచి మాగంటి అభిమానులు తరలివచ్చారు. మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను భారీ మెజార్టీతో గెలిపిస్తామని హామీ ఇచ్చారు. పదేండ్ల పాటు తమకు సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందించిన మాగంటికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపుతో ఘనమైన నివాళులర్పిస్తామని తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండేవారని, నేడు కాంగ్రెస్ హయాంలో ఏ ఒక్కరూ సంతోషంగా లేర ంటూ సభకు వచ్చిన సామాన్య ప్రజలు మా ట్లాడుకుంటున్నారు. మాగంటి పేరు తమ ప్రాంతంలో ప్రతి ఇంటికి పరిచయం అని, ఆయన కుటుంబానికి మేమంతా అండగా ఉంటామంటూ సామాన్యులు కదిలి వచ్చారు. బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన కార్యకర్తల సమావేశమే బహిరంగ సభ కంటే భారీగా జరగడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు జీర్ణించుకోలేక పోతున్నారు. అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు తిరుగుతున్నా ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో తమకు ఓటమి ఖాయమనే భావనలో పలువురు కాంగ్రెస్ నేతలు ఉన్నట్లు స్థానిక ప్రజలు మాట్లాడుకుంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో ఉన్న నవీన్‌యాదవ్ కుటుంబానికి నేర చరిత్ర ఉండడం, ఎటూ చూసిన గల్లీలో ఉండే కొందరు చిల్లరగాళ్లు అప్పుడప్పుడు హడావిడి చేస్తున్నా.. అసలైన కార్యకర్తలు, ప్రజల బలం తమకు లేదనే భావనలోకి కాంగ్రెస్ కీలక నేతలు భావిస్తున్నారు. జుబ్లీహిల్స్‌లో భిన్న వర్గాల ప్రజలు ఉండడంతో ప్రతి వర్గం కాంగ్రెస్ పార్టీ నుంచి బాధలు అనుభవిస్తుందని స్థానికులు మాట్లాడుకుంటున్నారు. మాయ మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి, జుబ్లీహిల్స్ ఎన్నికల్లో మాగంటి సునీతను భారీ మెజార్టీతో గెలిపించి గుణపాఠం చెప్పాలని ఆయా కాలనీలు, బస్తీలలో మాట్లాడుకుంటున్నారు. రాష్ట్రం బాగుపడాలంటే కాంగ్రెస్ ఓడిపోవాల్సిందేనని సామాన్య ప్రజలు చర్చించుకుంటున్న అంశాలు కాంగ్రెస్ నేతల చెవిలో పడుతున్నాయి. దీంతో దిక్కుతోచని పరిస్థితుల్లో కాంగ్రెస్ నాయకులు డివిజన్ల వారీగా కార్యకర్తల సమావేశాన్ని నిర్వహిస్తున్నా పట్టుమని పది మంది కూడా హాజరవ్వడం లేదంటూ ప్రతి గల్లీలో సామాన్య ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు తిరుగుతున్నా ఎవరు కూడా పట్టించుకోవడం లేదని, కాంగ్రెస్ పని అయిపోయినట్లే అంటూ నియోజకవర్గంలోని పలువురు చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఓటమి భయం పట్టుకున్న తరుణంలో సోమవారం బీఆర్ఎస్ పార్టీ రహ్మత్‌నగర్‌లోని ఎస్పీఆర్ గ్రౌండ్లో నిర్వహించిన సమావేశానికి హాజరైన కార్యకర్తలు, ప్రజలతో ఆ గ్రౌండ్ అంతా కిక్కిరిసిపోవడమే బీఆర్ఎస్ గెలుపును సూచిస్తుందంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు.
బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి భారీ సంఖ్యలో ప్రజలు హాజరుకావడంతో కాంగ్రెస్ పార్టీ అధినాయకులకు ముచ్చెమటలు పట్టాయి. దీంతో బీఆర్ఎస్ పార్టీ సమావేశానికి అంత మంది ఎలా హాజరయ్యారు, ఎంత మంది వచ్చారంటూ ఇంటలిజెన్స్‌తో అధికార పార్టీ నాయకులు లెక్కలు తెప్పించుకుంటున్నట్లు సమాచారం. అయితే నేర చరిత్ర ఉన్న కుటుంబానికి టిక్కెటు ఇవ్వడంతో జుబ్లీహిల్స్‌లోని సాధారణ ప్రజలతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక నాయకులు సైతం ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత ఇంటింటికి వెళ్లి చేస్తున్న ప్రచారం, బీఆర్ఎస్ పార్టీకి ప్రజలలో ఉన్న ఆదరణను చూసి కాంగ్రెస్ పార్టీ నాయకులకు జుబ్లీహిల్స్‌లో పాలుపోని పరిస్థితి నెలకొందంటూ సాధారణ ప్రజలు మాట్లాడుకుంటున్నారు.