Diet During Fever | సీజన్లు మారినప్పుడు చాలా మంది సహజంగానే దగ్గు, జలుబు, జ్వరం వంటి అనారోగ్య సమస్యల బారిన పడుతుంటారు. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు లేదా వర్షం బాగా పడే సమయంలో చాలా మందికి జ్వరాలు కూడా వస్తుంటాయి. ముఖ్యంగా ఇలాంటి సమయాల్లో దోమలు అధికంగా వృద్ధి చెందుతాయి. దీంతో అవి కుట్టడం వల్ల వివిధ రకాల జ్వరాలు వస్తాయి. మలేరియా, డెంగీతోపాటు ఇతర విష జ్వరాలు కూడా వస్తుంటాయి. అయితే జ్వరం వచ్చినవారు డాక్టర్లు ఇచ్చే మందులను క్రమం తప్పకుండా వాడాల్సి ఉంటుంది. అవసరం అయితే హాస్పిటల్లో ఉండి చికిత్స తీసుకోవాలి. ఇక జ్వరం వచ్చిన వారు ఆహారం విషయంలోనూ అనేక మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాలి. అలాగే కొన్ని రకాల ఆహారాలను రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఆహారం విషయంలో జాగ్రత్తలను పాటిస్తే జ్వరం నుంచి త్వరగా కోలుకుంటారు. ఆరోగ్యంగా ఉంటారు.
జ్వరం వచ్చినవారు డీహైడ్రేషన్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శరీరంలోని నీరు త్వరగా బయటకు వెళ్లిపోతుంది. ద్రవాలు త్వరగా తగ్గిపోతాయి. కనుక జ్వరం ఉన్నవారు నీళ్లను అధిక మోతాదులో తాగాల్సి ఉంటుంది. దీని వల్ల ద్రవాలు సమతుల్యం అవడంతోపాటు శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. ఇలాంటి సమయంలో కూల్ డ్రింక్స్, టీ, కాఫీ, మద్యం వంటి వాటిని తీసుకోకూడదు. ఇవి డీహైడ్రేషన్‌ను కలగజేస్తాయి. కనుక వీటికి దూరంగా ఉండాలి. నీళ్లను అధికంగా తాగాల్సి ఉంటుంది. నీళ్లను తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు ఎప్పటికప్పుడు బయటకు వెళ్లిపోతాయి. దీంతో జ్వరం నుంచి త్వరగా కోలుకుంటారు. ఇక జ్వరం ఉన్నవారు నారింజ పండ్లను తింటుంటే ఎంతగానో ఫలితం ఉంటుంది. ఈ పండ్లలో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీని వల్ల శరీరం వ్యాధులు, ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. దీంతో జ్వరం తగ్గిపోతుంది. మన శరీరంపై బ్యాక్టీరియా, వైరస్ల ప్రభావం తగ్గుతుంది. దీని వల్ల వ్యాధి నుంచి త్వరగా కోలుకుంటారు. యాక్టివ్‌గా మారుతారు.
ఇక జ్వరం ఉన్నవారు చాలా నీరసంగా ఉంటారు. శరీరంలో శక్తి లేనట్లు అనిపిస్తుంది. అలసటగా కూడా ఉంటుంది. అలాంటి వారు ప్రోటీన్లు ఉండే ఆహారాలను తీసుకుంటే మేలు జరుగుతుంది. ప్రోటీన్ల వల్ల శరీరానికి శక్తి లభించి ఉత్సాహంగా మారుతారు. చురుగ్గా ఉంటారు. యాక్టివ్‌గా పనిచేస్తారు. నీరసం తగ్గిపోతుంది. ఇక ఇందుకు గాను పాలను తాగవచ్చు. అలాగే పప్పు దినుసులు, బీన్స్, బాదంపప్పు, వాల్ నట్స్, పిస్తా, జీడిపప్పు, పెరుగు వంటి వాటిని తీసుకుంటే మేలు జరుగుతుంది. అలాగే జ్వరం ఉన్నవారు ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉండే ఆహారాలను తీసుకుంటే మేలు జరుగుతుంది. ఇవి గుమ్మడి విత్తనాలు, అవిసె గింజలు, పొద్దు తిరుగుడు విత్తనాలు, చియా సీడ్స్, అవకాడోలలో ఉంటాయి. కనుక వీటిని తింటుంటే ఫలితం ఉంటుంది. జ్వరం నుంచి త్వరగా కోలుకోవచ్చు.
జ్వరం ఉన్నవారు వేపుళ్లు, కారం, మసాలాలు, కొవ్వులు ఉండే ఆహారాలను తినకూడదు. తాజా పండ్లు, కూరగాయలను తినాలి. వీలైనంత వరకు ద్రవాహారం తీసుకోవాలి. వెజిటబుల్ సూప్ తాగితే మంచిది. స్వీట్ కార్న్, టమాటా వంటి వాటితో సూప్‌లను తయారు చేసి తాగాలి. యాపిల్ పండ్లను తింటుండాలి. జ్వరం ఉన్నవారికి ఇవి కూడా మేలు చేస్తాయి. జ్వరం వచ్చినవారు తేలిగ్గా జీర్ణం అయ్యే ఆహారాలను తీసుకోవాలి. పలుచని మజ్జిగను తాగాలి. దీని వల్ల శరీరానికి ప్రో బయోటిక్స్ లభిస్తాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. జ్వరం త్వరగా తగ్గేలా చేస్తాయి. ఇలా ఆహారం విషయంలో పలు మార్పులు చేసుకుంటే జ్వరం వచ్చిన వారు త్వరగా కోలుకుంటారు. మళ్లీ యాక్టివ్‌గా మారి ఉత్సాహంగా ఉంటారు. చురుగ్గా పనిచేస్తారు. శరీరంలో శక్తి స్థాయిలు సైతం పెరుగుతాయి.