Shraddha Kapoor | బాలీవుడ్ నటీమణి శ్రద్ధా కపూర్ షూటింగ్ సమయంలో గాయపడ్డారు. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ఈతా’ బయోపిక్ సెట్లో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో శ్రద్ధా ఎడమ కాలి వద్ద ఫ్రాక్చర్ కావడంతో సినిమా షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు.అయితే ఈ ప్రమాదంతో అభిమానులు ఆందోళన చెందారు. ఈ క్రమంలో శ్రద్ధా కపూర్ తన ఆరోగ్య పరిస్థితిపై స్పందించారు. ఒక అభిమాని పోస్ట్ చేసిన ప్రశ్నకు ఆమె రిప్లై ఇస్తూ, అది పెద్ద దెబ్బ ఏమీ కాదు. కాలి కండరానికి దెబ్బ తగిలడం వలన కొద్దిగా ఫ్రాక్చర్ అయింది. డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. నేను క్షేమంగానే ఉన్నా. త్వరలోనే మీ ముందుకు వస్తాను అని శ్రద్ధా కపూర్ పేర్కొన్నారు.
శ్రద్ధా కపూర్ ఎడమ కాలుకు గాయం కావడంతో ‘ఈఠా’ షూటింగ్ తాత్కాలికంగా నిలిచిపోయింది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం శ్రద్ధా కపూర్ దాదాపు 15 కిలోల బరువు పెరిగినట్లు కూడా ఈ మధ్య వార్తలు రావడం చూశాం. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నాసిక్‌లో షూటింగ్ జరుగుతోంది. మిడ్-డే నివేదిక ప్రకారం, ఒక పాటను చిత్రీకరిస్తున్న సమయంలో శ్రద్ధా ఈ ప్రమాదానికి గురైంది. స్పీడ్ డ్యాన్స్ మూమెంట్స్ వేస్తూ బరువైన ఆభరణాలు, నౌవారీ చీర ధరించి ఉన్న శ్రద్ధా శరీర బరువు మొత్తం ఎడమ కాలిపై వేయడంతో బ్యాలెన్స్ కోల్పోయి కిందపడ్డట్లు తెలిసింది. ఈ పాత్ర కోసం శ్రద్ధా 15 కిలోల పైగా బరువు పెరిగినట్టు యూనిట్ వర్గాలు వెల్లడించాయి.
ప్రమాదం తర్వాత వెంటనే ముంబైకి తరలించిన శ్రద్ధా, కొన్ని భావోద్వేగ సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొనడానికి ప్రయత్నించినా, నొప్పి ఎక్కువ కావడంతో షూటింగ్‌ను నిలిపివేశారు. ఆమె పూర్తిగా కోలుకున్న తర్వాత మరో రెండు వారాల్లో చిత్రీకరణను తిరిగి ప్రారంభిస్తామని చిత్రబృందం తెలిపింది. ‘ఈతా’ సినిమా మహారాష్ట్రకు చెందిన ప్రముఖ తమాషా కళాకారిణి విఠాబాయి నారాయణగావ్కర్ జీవిత కథ ఆధారంగా రూపొందుతోంది. ‘తమాషా సామ్రాజ్ఞి’గా పేరుగాంచిన విఠాబాయి జానపద నృత్యానికి చేసిన సేవలకు గాను 1957 మరియు 1990లో రాష్ట్రపతి పురస్కారాలు అందుకున్నారు.