హైదరాబాద్: హైదరాబాద్‌లో సీపీ సజ్జనార్ (CP Sajjanar) ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆదివారం అర్ధరాత్రి 12 గంటల నుంచి 3 గంటల వరకు లంగర్‌హౌస్, టోలిచౌకి ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. రౌడీషీటర్ల ఇండ్లకు నేరుగా వెళ్లారు. రౌడీషీటర్ల నేర చరిత్ర, ప్రస్తుత జీవనంపై ఆరా తీశారు. నేర ప్రవృత్తి విడిచిపెట్టాలని హెచ్చరించారు. మళ్లీ నేరాల వైపు అడుగు వేస్తే కఠిన చర్యలు తప్పవని వారిని హెచ్చరించారు. నేర ప్రవృత్తి వీడి సన్మార్గంలోకి రావాలని వారికి హితవు పలికారు. టోలిచౌకి పరిధిలో రాత్రిపూట తెరిచి ఉన్న హోటళ్లు, దుకాణాలు, ఇతర వ్యాపార సంస్థల్లోకి వెళ్లారు. నిబంధనలకు విరుద్ధంగా రాత్రివేళల్లో షాపులు తెరిచి ఉంచితే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యాపారులకు హెచ్చరికలు జారీ చేశారు.
పెట్రోలింగ్ సిబ్బంది ఎంత మేర అప్రమత్తంగా ఉన్నారు, రాత్రి వేళల్లో ప్రజల భద్రత కోసం ఎలాంటి చర్యలు చేపడుతున్నారు అనే అంశాలపై క్షేత్రస్థాయిలో నేరుగా ఆరా తీశారు. విధుల్లో ఉన్న కానిస్టేబుళ్లు, అధికారులను స్వయంగా కలుసుకుని, గస్తీ పాయింట్లు, స్పందన వేగం, సమస్యల పరిష్కారంపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం టోలిచౌకి పోలీస్ స్టేషన్‌ను సందర్శించి.. స్టేషన్ జనరల్ డైరీ, రాత్రి చేసిన ఎంట్రీలు, డ్యూటీలో ఉన్న సిబ్బంది హాజరు వివరాలు, వారికి అప్పగించిన బాధ్యతలను సమగ్రంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. రాత్రి వేళల్లో పోలిసింగ్‌ను మరింత బలోపేతం చేయడంతో పాటు, క్షేత్రస్థాయిలో సిబ్బంది ఎలా స్పందిస్తున్నారన్న విషయాన్ని ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఆకస్మిక పర్యటనలు చేస్తున్నట్లు తెలిపారు. పీపుల్ వెల్ఫేర్ పోలిసింగ్‌లో భాగంగా చేపడుతున్న ఈ పర్యటనలు సిబ్బంది బాధ్యతా భావాన్ని పెంపొందించడమే కాకుండా, సేవల నాణ్యతను మెరుగుపరుస్తాయని పేర్కొన్నారు. విజిబుల్ పోలిసింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని సిబ్బందికి సూచించిన ఆయన, నగరంలో నేరాలపై కఠినమైన పర్యవేక్షణ కొనసాగుతున్నట్లు స్పష్టం చేశారు. హైదరాబాద్ నగర భద్రత కోసం పోలీసులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, ప్రతి సమస్యకు వెంటనే స్పందించే విధంగా బృందాలు సిద్ధంగా ఉండాలని అధికారులకు ఆదేశించారు.