Ozone Pollution | పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న ఓజోన్ కాలుష్యంపై సీపీసీబీ (CPCB) నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT)కి కీలక నివేదిక సమర్పించింది. తక్షణం చర్యలు తీసుకోకపోతే ఊపిరితిత్తుల వ్యాధులు, ఉబ్బసం కేసులు వేగంగా పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. పంటలకు సైతం గణనీయమైన నష్టం జరిగే అవకాశం ఉందని చెప్పింది. వాహనాల ఉద్గారాలను తగ్గించడం, కర్మాగారాల్లో ఫిల్టర్ల ఏర్పాటు, నగరాల్లో చెట్లను నాటించాలని బోర్డు సిఫారసు చేసింది.
2024 ఆగస్టు 20న ఈ అంశంపై విచారణకు ఎన్జీటీ షెడ్యూల్ చేసింది. డేటాను విశ్లేషించాలని సీబీసీబీని ఆదేశించింది. భూ స్థాయి ఓజోన్లో ప్రమాదకరమైన పెరుగుదలను హైలైట్ చేసిన కేసులో
సీఎస్ఈ నివేదిక ఆధారంగా వచ్చిన మీడియా నివేదికలను ట్రిబ్యునల్ సుమోటోగా తీసుకుంది. వేడి, సూర్యకాంతి ఓజోన్ నిర్మాణాన్ని వేగవంతం చేస్తుందని, ఇది పట్టణ ప్రాంతాల్లో హాట్స్పాట్లు ఏర్పడటానికి దారితీస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ సమస్యను తీవ్రంగా పరిగణించి, ఓజోన్ నియంత్రణపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలనే పర్యావరణ మంత్రిత్వ శాఖ, సీపీసీబీ నుంచి వచ్చిన ప్రతిపాదనలను ఎన్జీటీ అంగీకరించింది.
బోర్డుకు చెందిన శాస్త్రవేత్త ఈ ఆదిత్య శర్మ ఈ ఏడాది సెప్టెంబర్ 25న దాఖలు చేసిన నివేదికలో అస్థిర సేంద్రియ సమ్మేళనాలు, (VOCs), నైట్రోజన్ ఆక్సైడ్లు (NOx), కార్బన్ మోనాక్సైడ్ (CO), మీథేన్ (CH4) నుంచి ఓజోన్ నేల స్థాయిలో ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఇది వేడి, సూర్యకాంతిలో వేగంగా పెరుగుతుంది. ఎన్ఏఏక్యూఎస్ (NAAQS) (8 గంటల సగటు 100 μg/m3, 1 గంట సగటు 180 μg/m3) తో సమలేఖనం చేయబడిన 2శాతం కంటే ఎక్కువ ఉల్లంఘన ప్రమాణాల ఆధారంగా డేటాను బోర్డు ఉదహరించింది. ఇప్పుడు చర్యలు తీసుకోకపోతే, సమస్య రెట్టింపు అవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.
నివేదిక ప్రకారం, వేసవిలో ఓజోన్ కాలుష్యం మరింత తీవ్రమవుతుంది. ఏప్రిల్-జూలై 2023లో ఢిల్లీలో ఆరు, ముంబయిలో మూడు సహా పది మానిటరింగ్ స్టేషన్లలో వాయిలేషన్స్ రికార్డయ్యాయి. ఈ సంఖ్య 2024లో 24 స్టేషన్లకు బాగా పెరిగింది. ఇందులో ఢిల్లీలో 21, చెన్నైలో రెండు, హైదరాబాద్లో ఒకటి ఉన్నాయి. రాత్రిపూట కూడా ప్రమాదం తగ్గడం లేదని నివేదిక పేర్కొంది. 2023లో ఢిల్లీలో ఆరు, ముంబయిలో ఒకటి, పుణేలోని ఒక స్టేషన్లతో రాత్రి సమయంలో 8 స్టేషన్లలో ఓజోన్ లెవెల్స్ ప్రమాణం కంటే ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. CPCB ప్రకారం, అటవీ ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు, నేల వాయువులు వంటి సహజ వనరులు కూడా ఓజోన్ ఏర్పడటానికి దోహదం చేస్తాయని పేర్కొంది. పర్యావరణ మంత్రిత్వ శాఖ ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నది.
ఓజోన్ కాలుష్యం అంటే..?
ఓజోన్ అనేది మూడు ఆక్సిజన్ అణువులతో కూడిన వాయువు. ఆకాశంలో ఎత్తయిన ప్రదేశంలో ఇది సూర్యుడి హానికరమైన కిరణాల నుంచి మనల్ని రక్షిస్తుంది. కానీ, భూమికి దగ్గరగా, ఇది కాలుష్య కారకంగా మారుతుంది. ఇది నేరుగా ఏ మూలం నుంచి రాదు. కానీ వాహనాలు, పరిశ్రమలు, విద్యుత్ ప్లాంట్లు సూర్యకాంతితో విడుదల చేసే నైట్రోజన్, అస్థిర కర్బన సమ్మేళనాలు, కార్బన్ మోనాక్సైడ్ రసాయన ప్రతిచర్య ద్వారా ఏర్పడుతుంది. ఓజోన్ కాలుష్యానికి కారణాల విషయానికి వస్తే.. ఓజోన్ పెరుగుదల వాతావరణం, కాలుష్య వనరులపై ఆధారపడి ఉంటుంది. వేడి, సూర్యకాంతి దాని రసాయన ప్రతిచర్యను పెంచుతాయి. వాహనాలు, పరిశ్రమలు, చెత్తను కాల్చడం, ఘన ఇంధనాల వాడకం దీనికి కారణాలుగా నిపుణులు పేర్కొంటున్నారు.