Dasoju Sravan | హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.46, సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విరుచుకుపడ్డారు. ఈ జీవో కపటత్వం, గందరగోళం, మోసం, పరిపాలన అజ్ఞానానికి ప్రత్యక్ష నిదర్శనమని పేర్కొన్నారు. వార్డు సభ్యులకు SEEEP సర్వే డేటా, సర్పంచ్ స్థానాలకు 2011 జనగణన డేటా ఉపయోగించడం ఘోర విరోధాభాసమని విమర్శించారు.
“ఒకే రిజర్వేషన్ ప్రక్రియలో రెండు వేర్వేరు డేటా మూలాలా? ఇది పాలన కాదు.. అణగారిన వర్గాలను బహిరంగంగా మోసం చేయడమే” అని దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. ఆర్టికల్ 243D ప్రకారం స్థానిక సంస్థల రిజర్వేషన్లు చివరిగా ప్రచురితమైన జనగణన ఆధారంగానే జరగాలని గుర్తు చేస్తూ, “SEEEP సర్వేకు రాజ్యాంగ ఆధారం ఏమిటి? దానికి చట్టబద్ధత ఎక్కడ? ఈ జీవో రాజ్యాంగంపై నేరుగా దాడి” అని వ్యాఖ్యానించారు. ఈ చర్య రిజర్వేషన్లను వక్రీకరించడానికో లేదా ఎన్నికలను వాయిదా వేయడానికో ఉద్దేశపూర్వక ప్రయత్నమని అనుమానం వ్యక్తం చేశారు.
GO 46లో పేర్కొన్న 20 నవంబర్ 2025 నాటి ‘డెడికేటెడ్ కమిషన్’ నివేదికపై కూడా దాసోజు శ్రవణ్ తీవ్ర సందేహం వ్యక్తం చేశారు. “ఆ కమిషన్ ఏది? చైర్మన్ ఎవరు? నివేదిక ఎక్కడ? ఇప్పటికే మార్చి 2025లో సమర్పించిన నివేదిక మాత్రమే తెలిసినది. ఇది కొత్త కుట్రకు నాంది కాదా?” అని ప్రశ్నించారు. ఇంతకాలం బీసీ సంక్షేమ శాఖ జారీ చేసిన రిజర్వేషన్ జీవోలను ఇప్పుడు పంచాయతీ రాజ్ శాఖ జారీ చేయడంపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఈ తొందర ఎందుకు? ప్రజల నుంచి ఏమి దాచుతున్నారు?” అని నిలదీశారు.
GO 46లో రెండు డేటా మూలాలు, ఏకరీతి లేమి, చట్టబద్ధత లేకపోవడం, పారదర్శకత లేని విధానం స్పష్టంగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. “జనాభా ఆధారమే తేల్చలేని ప్రభుత్వం న్యాయమైన ఎన్నికలు ఎలా నిర్వహిస్తుంది? ఇది పాలనా వ్యవస్థా? లేక రాజకీయ నాటకమా?” అని విమర్శించారు. 42శాతం బీసీ రిజర్వేషన్ను తప్పించుకోవడానికే ఈ జీవో తీసుకొచ్చారని విమర్శించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలను మభ్యపెట్టి స్థానిక ఎన్నికల నుంచి తప్పించుకునే కుట్ర ఇది అని ఆరోపించారు.
రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రయోజనాల కోసం అణగారిన వర్గాల భావోద్వేగాలతో ఆటలాడుతున్నారని దాసోజు శ్రవణ్ విమర్శించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే GO 46 చట్టబద్ధతపై స్పష్టత ఇవ్వాలని, ఉపయోగించిన డేటా మూలాల వివరాలు వెల్లడించాలని, 20 నవంబర్ కమిషన్ నివేదికను ప్రజల ముందుంచాలని, బీసీ రిజర్వేషన్లలో రాజ్యాంగ పరిరక్షణ పాటిస్తూ వెంటనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. “ప్రభుత్వం సమాధానం ఇవ్వకపోతే GO 46 ప్రజల దృష్టిలో మోసం, ద్రోహానికి ప్రతీకగా మారుతుంది. తెలంగాణ సాధించినది ఇలాంటి మోసపూరిత పాలనను భరించేందుకు కాదు” అని హెచ్చరించారు.