IBomma Ravi | సినిమాల పైరసీ కేసులో ఐ బొమ్మ ఇమంది రవి పోలీసుల విచారణ శనివారం మూడో రోజు ముగిసింది. ఐదు రోజుల కస్టడీలో భాగంగా పైరసీ ఇమంది రవికి ఏజెంట్లు, గేమింగ్ యాప్‌ల నిర్వాహకులతో ఉన్న సంబంధాలపై పోలీసులు ఆరా తీశారు. పైరసీకి ఎవరు సహకారం అందిస్తున్నారు.. తెర వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారనే విషయాలపై పోలీసులు ప్రశ్నించారు. సైబర్ నేరాలకు ఐ బొమ్మ సైట్‌ను నేరగాళ్లు వేదికగా మలుచుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సినిమాల సేకరణ, సైట్లో అప్‌లోడ్‌కు సంబంధించిన వివరాలను పోలీసులు అడిగి తెలుసుకున్నారు. అయితే, విచారణలో పోలీసులకు రవి సహకరించడం లేదని సమాచారం.
పోలీసులు అడిగిన ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు చెబుతున్నాడని తెలిసింది. యూజర్ ఐడీ, పాస్వర్డులు అడిగితే గుర్తు లేదు.. మరిచిపోయానని రవి సమాధానం చెప్పినట్లు సమాచారం. ఎథికల్ హ్యాకర్ల సహాయంతో హార్డ్‌డిస్క్‌లు, పెన్ డ్రైవ్‌లను పోలీసులు ఓపెన్ చేస్తున్నారు. ఫ్రాన్స్, నెదర్లాండ్‌లో మెయిన్ సర్వర్లు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. బ్యాంక్ ఖాతాల విషయంలోనూ రవి నోరువిప్పలేదని.. రవి అకౌంట్ల వివరాలు ఇవ్వాలని పలు బ్యాంకులకు పోలీసులు మెయిల్ పంపారు. ప్రతీరోజూ 20 రోజులకు ఒక్కో దేశానికి రవి వెళ్లాడని.. దీనిపై ప్రశ్నిస్తే తనకు విదేశీ పర్యటనలంటే ఇష్టమని.. అందుకే వెళ్లాలని రవి చెప్పినట్లు తెలియవచ్చింది. రవి పర్యటించిన దేశాల్లో పైరసీ లింకుల కూపీ లాగుతున్నారు పోలీసులు.