హనుమకొండ చౌరస్తా : ప్రభుత్వ నిబంధనలను పాటించని ప్రైవేట్ స్కూళ్లను( Private schools ) వెంటనే మూసి వేయాలని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. శనివారం హనుమకొండ జిల్లా కేంద్రంలో వామపక్ష విద్యార్థి సంఘాలైన ఎస్ఎఫ్ఐ, పీడీఎస్‌యూ, ఏఐఎస్ఎఫ్, ఏఐఎఫ్‌డీ.ఎస్, ఏఐఎస్బీ, సంఘాల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డికి( MLA Rajendar Reddy) వినతిపత్రాన్ని అందజేశారు.
జిల్లా పరిధిలో ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు ప్రభుత్వ నియమ, నిబంధనలు ( Rules ) పాటించకుండా, ప్రభుత్వ జీవోలను తుంగలో తొక్కుతున్నారని ఆరోపించారు. అనుమతులు పొందిన పత్రాల ప్రకారం కాకుండా స్కూల్ బోర్డులపై ఐఐటీ, నీట్, డీజీ, ఒలంపియాడ్, ఇ-టెక్నో, స్మార్ట్ ఇంటర్నేషనల్, పబ్లిక్, ప్రైమ్ లాంటి తోక పేర్లు తగిలించుకొని పాఠశాలలు నడుపుతూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు.
ప్రతి సంవత్సరం 10 నుంచి 15 శాతం ఫీజులను ఎఫ్ఆర్సీతో సంబంధం లేకుండా అడ్మిషన్, పరీక్ష, కంప్యూటర్, లైబ్రరీ, స్పోర్ట్స్, డెవలప్మెంట్, లాంటి రకరకాల ఫీజుల పేరుతో నిలువునా దోచుకుంటున్నారని పేర్కొన్నారు. ట్రస్ట్‌లు, సొసైటీల పేరుతో నడిపే పాఠశాలల్లో సంబంధిత అధికారులు ఆడిట్ చేయకపోవడంతో కోట్ల రూపాయల బ్లాక్ దందాలకు పాల్పడుతున్నాయని వెల్లడించారు.
వెంటనే సంబంధిత విద్యాశాఖ అధికారులు, ప్రభుత్వం స్పందించి పాఠశాలల్లో వసూలు చేసిన ఫీజులన్నింటిపై అడిట్ చేయించాలని డిమాండ్ చేశారు. యాజమాన్యాలపై క్రిమినల్, చీటింగ్ కేసులను నమోదు చేయాలని లేకపోతే పెద్దఎత్తున ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని, సంబంధిత విద్యాశాఖాధికారులను హెచ్చరించారు.
కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు మొగిలి వెంకట్ రెడ్డి, గడ్డం నాగార్జున, హకీమ్ నవీద్, బోయిన సంతోష్, బి.నరసింహారావు, మంద శ్రీకాంత్, మాస్ సావిత్రి, స్టాలిన్, రాచకొండ రంజిత్, వంశీ, బొజ్జు జ్యోతి, వంశీ, బొచ్చు కళ్యాణ్, బీరెడ్ది జస్వంత్, శ్రీపతి వినయ్, బండి లావణ్య, నగరారపు అనూష,ముషారాఫ్ తదితరులు పాల్గొన్నారు.