Ravindra Jadeja : ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్‌కు ముందే రవీంద్ర జడేజా(Ravindra Jadeja) తన పాత జట్టుతో కలిశాడు. ట్రేడ్ డీల్ ద్వారా చెన్నై సూపర్ కింగ్స్ నుంచి అతడు రాజస్థాన్ రాయల్స్‌కు మారాడు. ఐపీఎల్ కెరీర్ ఆరంభించిన జట్టు తరఫున మళ్లీ ఆడేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నానని అంటున్నాడు జడేజా. ఆ ఫ్రాంచైజీతో తనకు ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయంటున్న జడ్డూ.. క్రికెటర్‌గా తన ప్రయాణం అక్కడే మొదలైందని చెబుతున్నాడు. ట్రేడింగ్ చర్చల సమయంలో తన మనసులో ఏం మెదిలిందో ఈ ఆల్‌రౌండర్ మాటల్లోనే..
‘నాకోసం ట్రేడింగ్ డీల్ జరుగుతున్నప్పుడు నా జర్నీ మొదలైన ఫ్రాంచైజీకి మళ్లీ ఆడాలనే ఆలోచన వచ్చింది. క్రికెటర్‌గా నా ప్రయాణం అక్కడే మొదలైంది. అప్పటి కెప్టెన్ దివంగత షేన్ వార్న్ నన్ను రాక్‌స్టార్ అని పిలిచేవారు. మళ్లీ ఆ ఫ్రాంచైజీకి వెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. పదిహేనేళ్ల తర్వాత మళ్లీ రాజస్థాన్‌కు వెళ్తున్నా. అందుకే రాజస్థాన్‌కు ఆడేందుకు ఎదురుచూస్తున్నా. ప్రస్తుతం నేను క్రికెట్‌ను ఆస్వాదించే దశలో ఉన్నాను. నన్ను ప్రేమతో పిలిచేవాళ్లకు. నన్ను మనస్ఫూర్తిగా అభినందించేవాళ్లను, గౌరవించేవాళ్లను నేనేంతో ఇష్టపడుతాను’ అని జడ్డూ తెలిపాడు.
2008 🤝 2026
Ravindra Jadeja’s #TATAIPL journey comes full circle 🩷#TATAIPLAuction | @imjadeja pic.twitter.com/OkDlkXN2Qh
— IndianPremierLeague (@IPL) November 16, 2025
ఐపీఎల్ పద్దెనిమిదో సీజన్ తర్వాత సంజూ శాంసన్ ఫ్రాంచైజీ మారాలనుకున్నాడు. అప్పటి నుంచి అతడిని ట్రేడ్ ద్వారా అమ్మేసి.. మరొకరిని తీసుకోవాలనుకుంది రాజస్థాన్. సంజూ చెన్నైకి ఆడాలని ఆశపడుతుండడంతో.. ఆ జట్టు నుంచే రవీంద్ర జడేజాను తమ గూటికి తిరిగి తెచ్చుకోవాలని రాజస్థాన్ యాజమాన్యం పావులు కదిపింది. ఫ్రాంచైజీ సహయజమాని మనోజ్ బడాలే ఫోన్ చేసి జడ్డూనే రాజస్థాన్‌కు రావాల్సిందిగా కోరాడు. కోచ్ కుమార సంగక్కర కూడా ఇదే మాట అడగడంతో.. జడేజా సరేనని అంగీకరించాడు. దాంతో.. రూ.14 కోట్లకు అతడిని రాజస్థాన్ దక్కించుకుంది. అతడితో పాటు సాయ్ కరన్‌ను కూడా అప్పగించింది సీఎస్కే.