కుభీర్ : మండల కేంద్రంలోని నాగేష్ జిన్నింగ్ మిల్లులో సోమవారం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్లను(Cotton procurement ) జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి గజానన్, సీపీఓ వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఫ్యాక్టరీలో తూకం యంత్రానికి, పత్తి తీసుకువచ్చిన ఎడ్ల బండికి పూజలు చేసిన అనంతరం తూకం వేశారు. పార్డి కే గ్రామానికి చెందిన సురేష్ అనే రైతును శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా ఫ్యాక్టరీలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఏడీఎం గజానన్ ( ADB Gajanan ) మాట్లాడుతూ రైతులు తమ పత్తిని ఆరబెట్టుకుని 8 నుంచి 12 తేమ శాతం ఉండేలా చూసుకోవాలని సూచించారు. కపాస్ యాప్ ( Kapas Aap) ద్వారా విక్రయానికి సంబంధించిన స్లాట్ బుకింగ్ చేసుకోవాలని కోరారు.
ఈ సందర్భంగా పలువురు రైతులు అధికారులతో వాదనకు దిగారు. ప్రతిరోజు వర్షం కురుస్తోందని ఎక్కడ ఆరబెట్టాలని, ఏ పత్తిని చూసినా కనీసం 18 నుంచి 20 తేమ వస్తుందని అధికారులు రైతులపై కనికరించాలని కోరారు. దీంతో అక్కడే ఉన్న సీసీఐ సీపీవో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి తమకు అందిన నిబంధనల మేరకే పత్తిని కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు.
ఎవరికీ వెసులుబాటు లేదని ఎలాంటి పరిస్థితుల్లో నైనా 8 నుంచి 12 మధ్యలో తేమ ఉండడంతో పాటు ఎకరాకు ఏడు క్వింటాళ్లు మాత్రమే సీసీఎల్ తూకం వేస్తామని పేర్కొన్నారు. స్లాట్ బుకింగ్ చేసుకుని సీసీఐకి పత్తిని తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్ శివరాజ్, భైంసా వ్యవసాయ శాఖ ఏడీఏ వీణ, ఏవో సారికారావు, మార్కెట్ కమిటీ కార్యదర్శి జంగం రాజేశ్వర్, మార్కెట్ కమిటీ చైర్మన్ గోనె కళ్యాణ్, ఆత్మ చైర్మన్ సిద్ధం వార్ వివేక్, వ్యాపారులు రెడ్డి శెట్టి సంతోష్, ఆనంద్, పత్తి రైతులు పాల్గొన్నారు.