నిర్మల్, నవంబర్ 2(నమస్తే తెలంగాణ) : కేసీఆర్ ప్రభుత్వం మత్స్యకారులకు ఉపాధి కల్పించి, వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు ఉచితంగా చేప పిల్లల పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టింది. దాదాపు ఎనిమిదేండ్లపాటు వానకాలం ప్రారంభానికి ముందే నిర్మల్ జిల్లా వ్యాప్తం గా ఉన్న చెరువులు, రిజర్వాయర్లలో చేప పిల్లలను వదిలిపెట్టేందు ప్రణాళికలు రూపొందించే వారు. మే చివరి నాటికి చేప పిల్లల కోసం టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి, జూలై, ఆగస్టు మాసాల్లో చెరువుల్లోకి కొత్తనీరు చేరగానే పిల్లలను వదిలేవారు. కేసీఆర్ ప్రభుత్వం ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయడంతో దాదాపు 20 వేల మత్స్యకార కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తూ వచ్చాయి. అయితే ఇందుకు భిన్నంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చేపపిల్లల పంపిణీపై చేతులెత్తేసేందుకు యత్నిస్తున్నది.
ప్రస్తుతం సీజన్ మొదలై మూడు నెలలు దాటుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు చేప పిల్లల పంపిణీ విషయంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్త్తున్నది. ఇప్పటి వరకు ప్రాజెక్టులు, చెరువుల్లో చేప పిల్లలను వదలకపోవడంతో ఈసారి పంపిణీపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇప్పటికే మూడుసార్లు టెండర్లు పిలిచినా ఏ ఒక్క కాంట్రాక్టర్ కూడా జిల్లాలోని చెరువులు, ప్రాజెక్టుల్లో చేప పిల్లలను వదిలేందుకు టెండర్లను దాఖలు చేయలేదు. కాంట్రాక్టర్లు వ్యూహాత్మకంగానే పాత బిల్లుల చెల్లింపుపై మొండికేసి టెండర్లు దాఖలు చేయడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.
అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచే ఉచిత చే ప పిల్లల పంపిణీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా నిర్మల్ జిల్లాలో యేటా నాలుగు కోట్లకు పై గా చేప పిల్లలను పంపిణీ చేయాలి. గతేడాది కాంగ్రెస్ ప్రభుత్వం ఇందులో నుంచి కేవలం 50 శాతం మాత్రమే పంపిణీ చేసి చేతులు దులుపుకున్నది. గతేడాదితోపాటు అంతకు ముందు సంవత్సరానికి సంబంధించి చేప పిల్లలను పంపిణీ చేసిన కాంట్రాక్టర్లకు దాదాపు రూ.4.57 కోట్ల బిల్లులు బకాయి ఉన్నాయి.
దీంతో గతేడాది కూడా కొంతమంది కాంట్రాక్టర్లు చేప పిల్లలను సరఫరా చేసేందుకు ముం ఢదుకు రాలేదు. దీంతో జిల్లా ఉన్నతాధికారులతోపాటు కొంతమంది స్థానిక ప్రజాప్రతినిధులు కాంట్రాక్టర్లను ఒప్పించి 50 శాతం వరకు చేపపిల్లలను పంపిణీ చేయించగలిగారు. అయితే ఈ సారి మాత్రం చేప పిల్లలను పంపిణీ చేసేందుకు ఏ ఒక్క కాంట్రాక్టర్ కూడా ముందుకు రాలేదు. ఇప్పటికే ప్రభుత్వం మూడు సార్లు టెండర్లు పిలిచినప్పటికీ ఎవరు కూడా టెండర్లు దాఖలు చేయలేదు. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడం, పథకం అమలుపై చిత్తశుద్ధి లోపించడంతోపాటు బిల్లులు చెల్లించకపోవడమే అంటున్నారు.

నిర్మల్ జిల్లాలోని దాదాపు 500 పైగా చెరువులతోపాటు నాలుగు ప్రాజెక్టుల్లో ఇప్పటికే చేప పిల్లలను వదలాలి. ఈ వానకాలంలో అతి భారీ వర్షాలు కురియడంతో రెండు నెలలుగా ప్రాజెక్టులతోపాటు జిల్లాలోని అన్ని చెరువుల్లో నీటి నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. ప్రతి జూలై, ఆగస్టు మాసాల్లోనే ఈ జలాశయాల్లో పెంపకం కోసం చేప పిల్లలను వదులుతుంటారు. ఇప్పటికే చేప పిల్లల బరువు సగానికి పైగా పెరగాలి. అదను దాటినా చేప పిల్లలను వదలక పోవడంతో ప్రస్తుతం ఈ జలాశయాలన్నీ గతంలో వదిలిన పిల్లలతోనే నెట్టుకొస్తున్నాయి. మరో నెల రోజుల్లోగా జలాయశయాల్లో ఉన్న చేపలన్నీ పూర్తిగా తగ్గిపోనున్నాయి.
ప్రస్తుతం వర్షాకాలం ముగిసినప్పటికీ జిల్లాలో ఇప్పటి వరకు చేప పిల్లల పెంపకానికి సంబంధించి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకపోవడం, ప్రభుత్వ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో 222 మత్స్యకార సొసైటీలు ఉండగా, ఇందులో 13 వేలకు పైగా సభ్యులు ఉన్నారు. వీరితోపాటు మరో ఏడు వేల మంది వరకు చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్నారు. దాదాపు 20 వేల కుటుంబాలు చేప పిల్లల పెంపకం, అమ్మకంపై జీవనం సాగిస్తున్నాయి. గత కేసీఆర్ ప్రభుత్వం మత్స్యకారులను ఆదుకునేందుకు ఉచిత చేప పిల్లల పంపిణీ పథకాన్ని ప్రారంభించి పకడ్బందీగా అమలు చేయగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో రెండేళ్లుగా ఈ ప్రక్రియకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే సీజన్ ముగిసి మూడు నెలలు గడుస్తుండడంతో మత్స్యకారులు చేపల దిగుబడిపై ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించి చేప పిల్లలు పంపిణీ చేయాలని కోరుతున్నారు.
మత్స్యకారులకు ఈ సంవత్సరం పూర్తి స్థాయిలో ఉపాధి దక్కడం అనుమానమేనంటున్నారు. ఇప్పటివరకు చేప పిల్లల పంపిణీకి సంబంధించి పూర్తిస్థాయిలో విధివిధానాలు ఖరారు కాకపోవడం ఆందోళన కలిగిస్తున్నది. ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తయితే చేప పిల్లలను దూర ప్రాం తాల నుంచి జిల్లాకు రవాణా చేసి ఉండేవారని చెబుతున్నారు. ఇటీవ లే మూడోసారి నిర్వహించిన టెండర్ ప్రక్రియలో కూడా కాంట్రాక్టర్లు చేప పిల్లల పంపిణీకి ముందుకు రాకపోవడంతో ఎప్పటిలోగా జలాశయాల్లో వదులుతారనేదానిపై స్పష్టత లేకుండాపోయింది. ఇటీవల కురిసిన భారీ వర్షాల తో రిజర్వాయ ర్లు, చెరువుల్లోకి నీరు వచ్చి చేరినందున ఇప్పటికే ప్రక్రియ మొదలైతే గడువులోగా చేప పిల్లలు చేతికొచ్చేవని పేర్కొంటున్నారు. నాణ్యమైన చేప పిల్లలను కాకుం డా, సన్నరకం చేప పిల్లలను సరఫరా చేయడంపై గతేడాది అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అయితే ఈసారి చేప పిల్లలు మరింత ఆలస్యంగా వదిలే అవకాశం ఉన్నందున వాటి పెరుగుదలపై తీవ్ర ప్రభావం చూపనున్నది. ఇదే జరిగితే మత్స్యకారుల ఉపాధి ప్రశ్నార్థకం కానున్నది.
నిర్మల్ జిల్లాలో ఈసారి చేప పిల్లల పంపిణీకి కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాలేదు. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో చేప పిల్లల పంపిణీకి ముందు కు వచ్చిన కాంట్రాక్టర్లతో సంప్రదింపులు జరుపుతున్నాం. త్వరలోనే వారి ద్వారా జిల్లాకు చేప పిల్లలను తెప్పించి జలాశయాల్లో వదులుతాం. మత్స్యకారులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.