పెన్‌పహాడ్, మార్చి 13 : మాదక ద్రవ్యాలు, డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులు అవగాహన ఉండాలని పెన్‌పహాడ్ ఎస్ఐ కాస్తల గోపికృష్ణ అన్నారు. మండల పరిధిలోని అనాజీపురం మోడల్ స్కూల్లో విద్యార్థులకు పోలీసు కళాబృందం ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన కల్పించారు. గంజాయి, డ్రగ్స్, మత్తు మందులు, గుట్కాలు ప్రమాదకరమన్నారు. విద్యార్థులు ఇంటర్నెట్ను సద్వినియోగం చేసుకోవాలని, సైబర్ మోసగాళ్ల ఉచ్చులో పడొద్దని సూచించారు. బ్యాంక్ ఖాతా, ఏటీఎం పిన్ నెంబర్లు, ఓటీపీ వివరాలు చెప్పవద్దన్నారు. ఆశ చూపిస్తే వాటికి ఆకర్షితులు కావొద్దన్నారు.
సైబర్ మోసాలకు గురైతే వెంటనే టోల్‌ఫ్రీ నెంబర్ 1930 కి కాల్ చేయాలన్నారు. వ్యక్తిగత ఫొటోలను డీపీలుగా పెట్టుకోవద్దన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేనివారు డ్రైవింగ్ చేయవద్దన్నారు. చదువుతోనే సమాజంలో గుర్తింపు లభిస్తుందన్నారు. ఉన్నత లక్ష్యంతో ముందుకు వెళ్లాలని సూచించారు. ఎవరైనా మత్తు పదార్థాలు విక్రయించినా, సేవించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కోడి లింగయ్య, హెడ్ కానిస్టేబుల్ మురళీధర్ రెడ్డి, కళాబృందం ఇన్చార్జి యల్లన్న, సభ్యులు గోపయ్య, సత్యం, చారి, కృష్ణ, గురులింగం, నాగార్జున పాల్గొన్నారు.

మాదక ద్రవ్యాల నివారణపై విద్యార్థులకు అవగాహన