MLA Gudem Mahipal reddy | పటాన్ చెరు, నవంబర్ 3: ఆసియాలోని అతిపెద్ద పారిశ్రామిక వాడగా పేరొందిన పటాన్ చెరు పట్టణంలో గల టంగుటూరి అంజయ్య ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు నాణ్యమైన సేవలు అందించాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. సోమవారం దవాఖానలో ఏర్పాటు చేసిన అభివృద్ధి కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆసుపత్రిలోని అన్ని విభాగాలను పరిశీలించారు. రోగులను అడిగి వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు.
ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి అత్యధిక శాతం నిరుపేదలే వైద్యం కోసం వస్తున్నారని.. సేవా దృక్పథంతో వైద్యం అందిస్తూ వారి మన్ననలు పొందాలని వైద్యులకు సూచించారు. ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది అందించిన సేవల మూలంగానే కేంద్ర, ఆరోగ్య శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వేలో పటాన్ చెరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి నాణ్యమైన సేవల విభాగంలో జాతీయస్థాయిలో ఏడవ స్థానం లభించిందని తెలిపారు. ఇదే దృక్పథంతో మరిన్ని అవార్డులను సాధించాలని కోరారు.
ప్రతీ సంవత్సరం 1500 కు పైగా ప్రసూతి ఆపరేషన్లు నిర్వహించడంతోపాటు 2 లక్షలకుపైగా రోగులకు ఔట్ పేషెంట్ విభాగంలో సేవలు అందించడం గర్వనీయమన్నారు. అన్ని విభాగాల్లో 24 గంటలపాటు వైద్య సేవలు అందించడంతోపాటు వివిధ రకాల ల్యాబ్ టెస్టులు ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
ఆస్పత్రిలో పరిశుభ్రతకు ప్రథమ ప్రాధాన్యత..
ఈ సందర్భంగా ఆసుపత్రిలో నెలకొన్న పలు సమస్యలను సూపరిండెంట్ చంద్రశేఖర్ ఎమ్మెల్యే జీఎంఆర్ దృష్టికి తీసుకెళ్లారు. మరమ్మత్తులకు గురైన ఆక్సిజన్ ప్లాంట్లను వెంటనే పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. ఆస్పత్రిలో పరిశుభ్రతకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన డయాలసిస్ యూనిట్ ద్వారా ప్రతి నెల 33 మంది రోగులు చికిత్స పొందుతున్నారని తెలిపారు.
రోగుల సంఖ్యకు అనుగుణంగా వైద్యులను నియమించాలని కోరుతూ అతి త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞాపన చేయనున్నట్లు తెలిపారు. అతి త్వరలో మరో అంబులెన్స్ కొనుగోలుకు నిధులు కేటాయిస్తానని తెలిపారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ప్రజలు ఎక్కువగా ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తారని, వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ సేవల్లో లోపం ఉండకూడదని ఆదేశించారు. సౌకర్యాలు లేవంటూ రోగులను వేరే ఆసుపత్రులకు రిఫర్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో ఆస్పత్రి సూపరిండెంట్ చంద్రశేఖర్, ఆర్ఎంవో ప్రవీణ, ఆస్పత్రి సలహా సంఘం సభ్యులు రాములు గౌడ్, కంకర సీనయ్య, మాజీ కార్పొరేటర్ అంజయ్య, ఆస్పత్రి వైద్యులు పాల్గొన్నారు.

